తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వ‌ల‌స కార్మికులు, విదేశాల నుంచి వ‌చ్చిన వారితో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. దీంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 10,567 మందికి పరీక్షలు నిర్వహించగా 105 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో 34 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,366కు చేరింది.  సోమవారం నమోదైన కేసుల్లో 8 కోయంబేడుకు సంబంధించినవి ఉండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 28 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,676కు చేరుకుంది. ఇందులో 446 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, 234 కోయంబేడు కేసులు, 112 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కోవిడ్‌ వల్ల కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 64కు చేరింది. ఇక‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,246గా ఉంది.

 

అదేవిధంగా తెలంగాణ‌లోనూ క‌రోనా వైర‌స్ ఉధృతి ఏమాత్ర‌మూ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. తెలంగాణలో సోమ‌వారం కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది. మొత్తం కరోనా కేసుల్లో 432 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉండ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ఇప్పటివరకు 1491 మంది కరోనా నుంచి కోలుకోగా, 88 మంది మరణించారు. 1,213 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాల‌వారీగా చూస్తే సోమ‌వారం కేసులు ఇలా న‌మోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 79, రంగారెడ్డి జిల్లాలో 3, మహబూబాబాద్‌ జిల్లాలో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, మెదక్‌ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం జిల్లాలో 1 ఉన్నాయి. ప్ర‌ధానంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: