అనేక‌ దశాబ్దాల పోరాటాల‌ ఫలితంగా.. వేల‌మంది త్యాగ‌ఫ‌లితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి సరిగ్గా ఆరేళ్లు.  2014 జూన్ 2న ఆవిర్భ‌వించిన తెలంగాణ ఆరేళ్ల ప్ర‌యాణంలోనే అద్భుత ఫలితాల‌ను సాధించి, ఈ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యం స్వ‌రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌రుగులు పెడుతోంది. కేసీఆర్ తీసుకున్న అనేక సాహ‌సిక నిర్ణ‌యాలు నేడు తెలంగాణ‌ను దేశంలోనే ఆద‌ర్శవంతంగా తీర్చిదిద్దాయి. అనేక రంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధానంగా వ్యవసాయం ఐటీ, పారిశ్రామిక రంగం దాకా, ఆరోగ్యం, విద్య నుంచి సంక్షేమం దాకా, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని విద్యుత్‌ ఉత్పత్తి దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ దూసుకుపోతోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు చిరునామాగా తెలంగాణ‌ నిలుస్తోంది. మిషన్‌ భగీరథ, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజ‌లో నిలుస్తోంది.

 

హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రత పెంచడం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ప‌రిపాల‌నాప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు తెలంగాణ‌లో అద్భుత‌మైన ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 2016లో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలు ఏర్ప‌డ్డాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు పాల‌న మ‌రింత చేరువ‌గా మారింది. అలాగే.. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తంగా పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది. తండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ 2018 మార్చి 28న చేసిన చట్టంతో కొత్తగా 1,777 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. 2019 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త హైకోర్టు మనుగడలోకి వచ్చింది.

 

శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పోలీసు సిబ్బంది నియామకాన్ని చేపట్టడంతోపాటు పోలీసు శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. దీంతో కొత్తగా ఏడు కమిషనరేట్లతోపాటు 25 పోలీసు సబ్‌ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలీసుస్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇక ప్ర‌పంచంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు మాన‌వ‌నిర్మితాల్లో ఒక అద్భుతంగా గుర్తింపు పొందుతోంది. ఇంత‌టి ప్ర‌గ‌తి క్రెడిట్ అంతా కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నేడు నిరాడంబ‌రంగా రాష్ట్ర అవ‌త‌ర వేడుక‌లు జ‌రుపుకోనున్నారు ప్ర‌జ‌లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: