ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఇసుక బుకింగ్ ను మరింత సులభం చేయనుంది. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించనుంది. నిన్న భూగర్భ గనులు, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక బుకింగ్ ను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. ఆన్ లైన్ మోసాలకు చెక్ పెడతామని... సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్ అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 
 
సచివాలయాల ద్వారా ఇసుక కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే గ్రామస్థాయిలో వినియోగదారుడికి ఇసుక మరింత సులభంగా లభించే అవకాశం ఉంది. త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటిస్తామని తెలిపారు. బల్క్ బుకింగ్ లకు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి బల్క్ బుకింగ్ కు జిల్లా స్థాయిలో పునః పరిశీలన జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 
 
ఇసుక రీచ్ కు పది కిలోమీటర్ల లోపే స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసి ఇసుక రవాణా భారం వినియోగదారులపై తగ్గించేలా చేస్తున్నామని అన్నారు. రాజమండ్రి నుంచి విశాఖకు గతంలో ఇసుక రవాణా కోసం కిలోమీటర్ కు 4.90 రూపాయల చెల్లింపులను 3.30 రూపాయలకు తగ్గించినట్టు తెలిపారు. వర్షాకాలం అవసరాల కోసం 40 లక్షల టన్నుల ఇసుక ప్రభుత్వం సిద్ధం చేసిందని... మరో 30 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాల్సి ఉందని తెలిపారు. 
 
సకాలంలో ఇసుక రవాణాదారులకు బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇసుక రవాణాకు జీ.పీ.ఆర్.ఎస్ లేని వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని తెలిపారు. రాత్రిపూట ఇసుక ఆపరేషన్లను తగ్గించాలని అధికారులకు సూచనలు చేశారు. పర్యావరణ నిబంధనలను అనుసరించి తవ్వకాలు జరపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: