దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా ధాటికి అతలాకుతలమవుతున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు లాక్ డౌన్, భౌతిక దూరం ద్వారా మాత్రమే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటలీ వైద్యులు తాజాగా ఒక శుభవార్త చెప్పారు. కరోనా విజృంభణతో అతలాకుతలం అవుతున్న దేశాలకు శుభవార్తను మోసుకొచ్చారు. 
 
కరోనా వైరస్ క్రమంగా శక్తిని కోల్పోతుందంటూ తాజాగా ప్రకటన చేశారు. గతంతో పోలిస్తే వైరస్ వల్ల ప్రాణహాని కలిగే శాతం చాలా వరకు తగ్గిందని తెలిపారు. రెండు నెలల క్రితం సేకరించిన శాంపిళ్లతో పోల్చి చూస్తే ప్రస్తుతం సేకరించిన శాంపిళ్లలో వైరస్ కణాల సంఖ్య భారీగా తగ్గిందని ఇటలీలోని శాన్ రఫేల్ ఆస్పత్రి చీఫ్ ఆల్బర్టో జాంగ్రిల్లో తెలిపారు. వైద్యపరిభాషలో చెప్పాలంటే తమ దేశం నుంచి వైరస్ మాయమైనట్టేనని ఆయన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రపంచంలో కరోనా మరణాల విషయంలో ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇటలీలో ఇప్పటివరకు 33,000 కు పైగా ప్రజలు కరోనా భారీన పడి మృతి చెందారు. ఇప్పటివరకు 2,00,000కు పైగా పాజిటివ్ కేసులతో ప్రపంచంలో ఆరవ స్థానంలో ఇటలీ ఉంది. గత నెలలో ఇటలీలో కరోనా నెమ్మదించడంతో ఆంక్షల సడలింపుల దిశగా ఆ దేశం అడుగులు వేస్తోంది. ఆల్బర్టో కరోనా రెండోసారి విజృంభించే అవకాశాలు లేవని... కొందరు నిపుణులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. 
 
దేశంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆయా దేశాల ప్రతినిధులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2,00,000కు చేరువలో ఉంది. నిన్నటివరకు దేశంలో 1,90,535 కరోనా కేసులు నమోదు కాగా 5,394 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 3118కు చేరగా తెలంగాణలో 2,792 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా భారీన పడి 64 మంది మృతి చెందగా తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 88కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: