నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఏపీ సర్కారు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే హైకోర్టు తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు ముందు ఏపీ సర్కారు ఏమని వాదించబోతోంది. ఏపీ వాదనలో బలం ఉందా.. ఈ అంశాలు పరిశీలించాలంటే.. ముందు ఏపీ సర్కారు సుప్రీంకోర్టు పిటిషన్ ను పరిశీలించాలి. అందులో ముఖ్యాంశాలు తెలుసుకోవాలి.

 

 

ఏపీ సర్కారు వాదనలు ఏంటంటే.. రాజ్యాంగంలోని అధికరణ 243కే, 243జెడ్‌ఏ ప్రకారం ఎన్నికల కమిషనర్‌ నియామకం పూర్తిగా గవర్నర్‌ విచక్షణ మేరకే ఉంటుందంటూ హైకోర్టు పూర్తిగా పొరపాటు పడింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్‌ సాధారణంగా తన రాజ్యాంగ అధికారాలను మంత్రి మండలి సలహా, సిఫారసు మేరకే ఉపయోగిస్తారు. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌ నియామకం ఆ ప్రత్యేక సందర్భాల పరిధిలోకి రాదు.

 

 

రాజ్యాంగంలోని అధికరణ 324(2) కింద ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించే విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారం, అలాగే అధికరణ 243కే కింద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం మధ్య హైకోర్టు ఓ కృత్రిమ వ్యత్యాసాన్ని చూపింది.

ఎన్నికల కమిషనర్‌ నియామక అధికారం గవర్నర్‌కే తప్ప, రాష్ట్రానికి లేదని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో పూర్వ ఎన్నికల కమిషనర్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకే నియమితులైనందున ఆ నియామకం కూడా చెల్లదు. ఇదే సమయంలో ఆశ్చర్యకరంగా పూర్వపు ఎన్నికల కమిషనర్‌ పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ లెక్కన హైకోర్టు తన తీర్పునకు తానే విరుద్ధంగా తీర్పునిచ్చింది కాబట్టి, దానిని రద్దు చేయాలి.

 

 

అలాగే.. జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామక నోటిఫికేషన్‌లో ఓ నిబంధనను ప్రస్తావించక పోయినంత మాత్రాన, ఆ నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేకుండా పోదు. జస్టిస్‌ కనగరాజ్‌ వయస్సును కారణంగా చూపుతూ హైకోర్టు ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కొట్టేయడం పొరపాటే. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఆర్డినెన్స్‌ తేవడం వల్ల నిమ్మగడ్డ రమేశ్‌ పదవీ కాలం ముగిసింది. అందువల్ల అతనే సర్వీసు వివాదంతో నేరుగా హైకోర్టును ఆశ్రయించినప్పుడు, అదే అంశంపై సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కూడా విచారించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటోంది ఏపీ సర్కారు. మరి ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా.. జగన్ సర్కారుకు ఊరట దక్కుతుందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: