దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం జులై నెల నుంచి స్కూళ్లను తెరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పాఠశాలలను తెరవాలని చెబుతున్నారు. 
 
రెండు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు సంతకాలు చేసి అప్పటివరకు పాఠశాలలు తెరవడానికి అనుమతించకూడదని పిటిషన్ ను కేంద్రానికి పంపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంగా పాఠశాలలు తెరవడం సరికాదని వారు చెబుతున్నారు. ఈ లర్నింగ్ మోడ్ లో విద్యా సంవత్సరం కొనసాగాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్ల ప్రారంభంపై రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలోని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మార్చి 16 నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. కేంద్రం మార్చి 25న లాక్ డౌన్ ను ప్రకటించగా కరోనా విజృంభణ వల్ల కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా కేంద్రం ఐదో విడత లాక్ డౌన్ ను మరో నెల రోజుల పాటు పొడిగించింది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ అమలు కానుంది. 
 
విద్యార్థుల తల్లిదండ్రుల పిటిషన్ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 7,761 కరోనా కేసులు నమోదయ్యాయి. 200 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,98,370కు చేరింది. గడచిన 24 గంటల్లో 200 మంది కరోనా భారీన పడి మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 5,608కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: