తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో రెండు గంటలు అదనంగా మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. 
 
ఎక్సైజ్ ‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ అన్ని జిల్లాల ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మందుబాబులకు శుభవార్త అనే చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మద్యం దుకాణాలకు కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో మే 6 నుంచి మద్యం దుకాణాలను తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. 
 
నిన్నటినుంచి రాష్ట్రంలో కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మార్చడంతో ప్రభుత్వం మద్యం దుకాణాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా భారీ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,792కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మృతుల్లో మూడున్నరేళ్ల చిన్నారి ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 1491 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా రాష్ట్రంలో 1213 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: