జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు మీడియాకు సంబంధించి తీసుకొచ్చిన జీవో 2430 విషయంలో దాఖలైన పిటిషన్‌ గురించి విచారణ జరిపి... జగన్ సర్కార్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. వార్తల విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలన్నదే 2430 జీవో లక్ష్యమని చెప్పగా కోర్టు ఈ పిటిషన్ విషయంలో తమ జోక్యం అవసరం లేదని పేర్కొంది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం కథనాలను ప్రచురించుకోవచ్చని కోర్టు తెలిపింది. 
 
ఏదైనా కథనం విషయంలో ప్రభుత్వం జీవో ప్రకారం చర్యలు ప్రారంభిస్తే ఆ ఆరోపణలు సమర్థనీయమా.. కాదా? అనే అంశంపై విచారించే స్వేచ్ఛ కోర్టుకు ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 30న నిరాధార వార్తలు ప్రచురించినా... ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా కేసులు వేసేందుకు వీలుగా ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాన్ని అప్పగిస్తూ జీవో 2430ను తీసుకొచ్చింది. 
 
ఈ జీవోను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. జగన్ సర్కార్ కోర్టు తీర్పు అనంతరం పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణ కోసం ఎనిమిది మందిని 'స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు'గా ప్రభుత్వం నియమించింది. 
 
కూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డిలను ప్రభుత్వం స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లుగా నియమించింది. గతంలో 'సాంకేతిక సమన్వయకర్తలు'గా వీరిని నియమించిన ప్రభుత్వం తాజాగా వారి పోస్టులను 'రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు'గా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: