ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వం కొనసాగిస్తూనే  ఉంటాయి విపక్ష పార్టీలు. కొన్ని కొన్ని సార్లు అధికార పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు... వారి వ్యవహారం ఏకంగా సొంత పార్టీలకే ఇబ్బందులు తెచ్చి పెట్టడంతోపాటు విపక్షాలకు ఆయుధంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. తాజాగా ఆంధ్ర రాజకీయాల్లో  ఇలాంటిదే ఏర్పడింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏకంగా సొంత పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తున్నాయి అనే చర్చ మొదలైందిప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో. ఇంతకీ ఏమైందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి. 

 

 గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు... గుంటూరులో ఇసుక నూతన విధానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో అక్రమాలపై ఘాటుగా విమర్శలు చేశారు. ఒక రీచ్ లోడింగ్ అయిన ఇసుక లారీ  ఇసుక డిపోకు వచ్చేసరికి... పూర్తిగా మాయమైపోతుంది అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇది ఎలా జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించారు అధికార పార్టీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. పల్లెటూర్లలో ఒక బొచ్చెడు కాదు కదా కనీసం దోశడు  ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అధికార పార్టీ ఎమ్మెల్యే.

 

 

 ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ఇసుక పాలసీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు... కనీసం జిల్లాలో నాడు నేడు.. ఉపాధి హామీ పనులకు సైతం ఇసుక సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఏకంగా  ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సొంత పార్టీకే ఇబ్బందులు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు దీనినే ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే  అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: