భారత్ సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని అమెరికా ఆరోపించింది. ఓ నియంత పాలనలోని ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తుందని మండిపడింది. దక్షిణ చైనా సముద్రం, కరోనా, హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు.. ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లో దూకుడు.. ఇలా ఏది చూసిన చైనా బుద్ధేంటో తెలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు సరిహద్దుల్లో చైనాకు దీటుగా బలగాల మోహరింపు చేస్తోంది భారత్. లడఖ్ లో అసలేం జరుగుతుందో చెప్పాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. 

 

చైనా తమ సైనిక బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందని అమెరికా రక్షణ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఈ అంశంలో భారత్‌కు మద్దతు పలికిన పాంపియో.. డ్రాగన్‌ దుశ్చర్యలను తప్పుబట్టారు. చైనా దుందుడుకుతనాన్ని నిర్ధారించిన పాంపియో.. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తి, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, కరోనా అంశాలను ప్రస్తావిస్తూ డ్రాగన్‌ తీరును ఎండగట్టారు. 

 

ప్రస్తుతం ఇండియా, చైనా సరిహద్దుల్లో గొడవ ముదురుతోంది. మరో డోక్లాం లాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. తూర్పు లడక్‌లోని ఎల్‌ఏసీ వెంట రెండు దేశాల మధ్య ఏర్పడిన వివాదం.. రానురాను మరింత పెద్దదవుతోంది. ఎల్‌ఏసీ వెంబడి పలు లొకేషన్లలో చైనా 5 వేల మందిని మోహరించినట్లు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. చైనా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిందని, టెంట్లు, బంకర్లు ఏర్పాటు చేసిందని చెబుతున్నాయి. దీంతో వివాదం రేగిన పాంగాంగ్, గాల్వాన్ వ్యాలీ ప్రాంతాల్లో ఇండియా కూడా సైనికుల సంఖ్యను పెంచుతోంది. చైనా బలగాలపై నిఘా ఉంచేందుకు సెన్సిటివ్ పాయింట్లలో మన బలగాలు పెట్రోలింగ్ కొనసాగిస్తున్నాయి.

 

మే 5న లడఖ్​లో బోర్డర్​లో 2 దేశాలకు చెందిన 250 మంది సోల్జర్లు గొడవకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకోవడం, రాళ్లు రువ్వడంతో 100 మందికి గాయాలయ్యాయి. స్థానిక ఆఫీసర్ల చర్చలతో గొడవ సద్దుమణగింది. మళ్లీ 4 రోజులకే సిక్కింలోని నాకు లా పాస్ వద్ద ఫైట్ జరిగింది. 10 మంది గాయపడ్డారు. పెట్రోలింగ్ చేస్తుంటే చైనా బలగాలు అడ్డుకుంటున్నాయని ఇండియా.. తమ టెర్రిటరీలోకి ఇండియన్ సోల్జర్లు చొరబడ్డారని చైనా ఆరోపించాయి.

 

పాంగాంగ్​ దగ్గర ఈ మధ్య జరిగిన గొడవలో మన సోల్జర్లను గాయపరిచేందుకు చైనా సైనికులు కర్రలు, ముళ్లకంచె చుట్టిన రాడ్లు, రాళ్లు ఉపయోగించారు. తమ బలగం ఎక్కువ ఉందని రెచ్చిపోయారు. కాశ్మీర్​లో సోల్జర్లపై పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు రాళ్లు విసిరినట్లుగా.. చైనా సైనికులు బిహేవ్ చేశారు. వాళ్ల సైనికులు ఎక్కువగా ఉండటంతో అన్ ప్రొఫెషనల్ ఆర్మీలా ప్రవర్తించారు. 

 

అసలు సరిహద్దుల్లో ఏం జరుగుతుందే కేంద్రం దేశ ప్రజలకు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడో ఉన్న అమెరికా అధ్యక్షుడికి కూడా ఇక్కడేం జరుగుతుందో తెలుస్తోందని, కానీ మోడీ ఎందుకు చెప్పడం లేదని నిలదీస్తున్నాయి. చైనా మన భూభాగంలో తిష్ట వేసిందో.. లేదో స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నాయి. ఓవైపు సరిహద్దుల్లో చైనాకు దీటుగా బలగాలను మోహరిస్తూనే.. మరోవైపు చర్చలు జరపాలని భారత్ భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: