జూన్ 2. తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తేదీ. ఒక చిరకాల స్వప్నం నెరవేరిన రోజు. వారికి పండుగ. అదే తేదీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం బాధను కలిగిస్తుంది. నిండు పాల కుండ లాంటి రాష్ట్రం రెండు ముక్కలు అయింది ఇదే రోజు కదా అని ఆవేదన చెందుతారు. అరవయ్యేళ్ళు కష్టపడి ఉమ్మడి రాజధాని మనది అని నిర్మించుకున్న హైదరాబాద్ పరాయి అయిపోయిన ఫీలింగ్.


నిజంగా ఈ ఆరేళ్ళలో ఏం సాధించింది ఏపీ అంటే ఏమీ లేదని చెప్పాలి. మొదట అయిదేళ్ళు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయాకత్వంలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారని వైసీపీ నేతలు అంటే, వైసీపీ ఏడాది పాలనలో  ఎనభై వేల కోట్లు అప్పు చేశారని టీడీపీ నేతలు అంటారు. సరే ఈ రెండింటిలో ఎంతో కొంత అతి ఉన్నా కూడా అప్పు చేసి పప్పుకూడు ఏపీ పరిస్థితి అన్నది మాత్రం అందరికీ తెలిసిందే.

 

ఇక రాజధాని అన్నది ఇప్పటికీ ఇదీ అని లేదు. ఒక్క విశాఖ తప్ప టైర్ వన్ సిటీ కూడా ఏదీలేదు. అన్నీ నగరాలకు తక్కువ, పట్నాలకు ఎక్కువగా ఉన్నాయి. ఇక పార్రిశ్రామికంగా అడుగులు పెద్దగా పడడంలేదు. వ్యవసాయికంగా ఏపీ అగ్రగామి కావాలన్నా కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. తొలి అయిదేళ్లలో పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన జాతీయ ప్రాజెక్ట్ పోలవరం అలాగే ఉంది.

 

ఇక ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. ప్రజలకు నిజంగా హైదరాబాద్ పోయిందన్న బాధను దిగమింగుకునేందుకు కొంత ఊరట అనుకున్న ప్రత్యేక హోదాను కూడా గోల్ మాల్ చేశారు. ఇవన్నీ చూసుకున్నపుడు ఏపీ విభజన తరువాత ఏం సాధించింది అనిపించకమానదు.

 

ఓ విధంగా ఏపీ  ఇపుడు చాలా ఇబ్బందులో ఉంది. కేంద్రంలోని పెద్దలు విడదీసిపోయారు. కానీ ఆదుకోవడానికి మాత్రం చేతులు రావడంలేదు. విభజన హామీలకు దిక్కులేదు. కేంద్రం మాత్రం అన్నీ ఇచ్చేశామని అంటోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఇప్పటికీ కారణం చెప్పలేకపోయిన ఢిల్లీ పెద్దలు ఏపీ ప్రజల ఆగ్రహానికి రాజకీయంగా గురి అయినా కూడా వారికి పార్టీల పరంగా ఏపీలోని అన్ని పార్టీల నుంచి మద్దతు లభించడమే విశేషం, విషాదం.

 

ఏది ఏమైనా  కూడా ఏపీ మళ్ళీ వెలుగు రేఖలా మారాలి. దేశానికి కాంతి రేఖ కావాలి. అంతవరకూ ఈ రోజు ఆంధ్రుల గుండెల్లో మాత్రం కెలుకుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: