జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు మారుపేరుగా నిలుస్తున్న ప‌వ‌న్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా తెలిపిన శుభాకాంక్ష‌లు ప‌లువురిని ఆక‌ర్షించాయి. ``ఈ రోజు చారిత్రాత్మకమైనది... కోట్లాది మంది కల సాకారమైన రోజు... దశాబ్దాల కోరిక నెరవేరిన రోజు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ జన్మించిన రోజు. వేలాది మంది బలిదానాలు, కోట్లాది మంది త్యాగాల ఫలం మన తెలంగాణ. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలను నడిపే నేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలపై ఉంది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దినదిన ప్రవర్థమానం అవ్వాలని, అభివృద్ధిలో తిరుగులేని శక్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నాను. ఈ మహత్కార్యం సాకారం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జేజేలు పలుకుతున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభవేళ నా తరఫున, జనసేన పార్టీ తరఫున తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.` అని ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

 


ప‌వ‌న్ తెలిపిన శుభాకాంక్ష‌లు ప‌లువురు తెలంగాణవాదుల‌ను ఆక‌ట్టుకోగా మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన ఓ ప్ర‌మాదం ప‌ట్ల ఆయ‌న స్పందించిన తీరు సైతం రాజ‌కీయ‌వ‌ర్గాల దృష్టిలో ప‌డింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో పేలుడు ప్రమాదం సంభ‌వించింది. ఇందులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ప‌వ‌న్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ``రామ‌గుండం ఓపెన్ కాస్ట్ ప్ర‌మాదం తీవ్ర వ్యధను కలిగించింది. బొగ్గు తవ్వకం కోసం పేలుడు నిర్వహించడానికి పేలుడు పదార్ధాలు నింపుతున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. పేలుడులో ప్రాణాలు కోల్పోయినవారు కాంట్రాక్టు కార్మికులు. అందరూ పేద వర్గాలకు చెందిన వారే. మృతి చెందిన వారు కాంట్రాక్టు కార్మికులే అయినప్పటికీ నష్టపరిహారం విషయంలో రెగ్యులర్ కార్మికులకు ఇచ్చే విధంగా వీరి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సింగరేణి కాలరీస్ యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పేలుడు పదార్ధాల నిర్వహణ, ఎక్స్ ప్లోజింగ్ వంటి ప్రమాదకర పనుల నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక పద్దతులు, రోబోల ఉపయోగాన్ని పరిశీలించాలని సూచిస్తున్నాను. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రమాదాల నివారణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.`` అని ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

 

ఇ‌క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆమెకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ``గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారికి నా తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. కరోనా కష్ట సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు మానవతా దృక్పథంతో స్పందించారు. రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేసే విధంగా ఆ కార్యక్రమాలు సాగడం, ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యే క్రమంలో తెలుగు భాష నేర్చుకోవడం సంతోషకరం. విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలు పెంచేందుకు, స్త్రీలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు తమిళనాడులో తమిళిసై సౌందరరాజన్ ఏళ్ల తరబడి నిర్వహించిన కార్యక్రమాలు ఆయా వర్గాల్లో ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్‌గా  విధులు నిర్వర్తిస్తున్న తమిళసై సౌందరరాజన్ జ‌న్మదినం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం యాధృచ్ఛికమే అయినా సంతోషదాయకం. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో గవర్నర్ గా తనదైన ముద్రను కనబరుస్తారనే విశ్వాసం ఉంది. ఆ సర్వేశ్వరుడు ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.` అని ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు ప‌వ‌న్.

మరింత సమాచారం తెలుసుకోండి: