దేశ‌వ్యాప్తంగా మిడ‌త‌ల దండు క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో పశ్చిమ భారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొచ్చేసింది. మధ్యప్రదేశ్‌ సరిహద్దు జిల్లా సిద్ధి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోనికి మిడతల దండు ఆదివారం ప్రవేశించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే క్రిమి సంహారాలను పిచికారీ చేయడంతో చాలా వరకు చనిపోయాయి. కొన్ని తిరిగి వెనక్కి వెళ్లాయి. అయితే ప‌క్క‌నే ఉన్న తెలంగాణ రాష్ట్రం వీటిని జాగ్ర‌త్త‌గా అధ్య‌య‌నం చేస్తోంది.

 


ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మిడతల దండు కలకలం రేపుతున్నది. ఏప్రిల్‌ 11న పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించి, రాజస్థాన్‌లోని సగం జిల్లాలకు విస్తరించి, వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహరాష్ట్ర మీదుగా కదులుతున్నాయి. ఈ దండును నియంత్రించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్లను వినియోగించారు. ఇవి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మిడతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారి చేశాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేశారు. 

 

కాగా, తెలంగాణ‌కు పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, చ‌త్తీస్‌ఘ‌డ్‌లోకి ఈ మిడ‌తల దండు ప్ర‌వేశించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప‌టికే అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘా బృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ వీటిపై ఆయా జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేక క‌మిటీ సైతం వేశారు. తాజా ప‌రిస్థితుల్లో తెలంగాణ ప్ర‌భుత్వ అధికారుల టీం క్రియాశీలంగా ప‌నిచేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: