ఓటుకు నోటు కేసు...రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యేని కొని తమవైపు తిప్పుకునేందుకు డబ్బులు ఇస్తూ, అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇక అప్పుడే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ తో పాటు పలువురు టీడీపీ నేతలని జైలుకు పంపారు.

 

ఇక ఈ కేసులో చంద్రబాబుకు ప్రమేయం ఉన్నట్లు ఒక వాయిస్ రికార్డింగ్ కూడా బయటకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కూడా కేసులో ఇరుక్కుంటారని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమి జరగలేదు గానీ, చంద్రబాబు మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరబాద్‌ని వదిలేసి అమరావతికి వచ్చేశారు. ఇక దాని తర్వాత చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

 

ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమైందో తెలుసు. అలాగే తెలంగాణలో 2018 ఎన్నికల్లో, ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏమైందో తెలుసు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఓటుకు నోటు కేసు మాత్రం చంద్రబాబుని వదలడం లేదు. ఏదొక సందర్భంలో వైసీపీ నేతలు, ఈ కేసు గురించి ప్రస్తావించి బాబుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ కేసు ప్రస్తావన పెద్దగా రాలేదు.

 

కానీ తాజాగా మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులు గురించి మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు భయంతో యూటర్న్ చంద్రబాబు తీసుకున్నారని,  వేలకోట్ల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణలో వదిలి కరకట్టకు వచ్చారని విమర్శించారు. అలాగే కేసీఆర్‌తో ఉన్న స్వార్ధప్రయోజనాల కోసం సీఎం జగన్.. వాటిపై నోరుమెదపకుండా.. వాటిని ఆయనకే అప్పగించారని మండిపడ్డారు. అయితే ఇక్కడ బాబు కేసుకు భయపడి ఏపీకి వచ్చారేమో గానీ, జగన్ మాత్రం స్వార్ధంతో ఆస్తులని అప్పగించలేదు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సఖ్యత ఉండాలనే ఉద్దేశంతో పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: