కొన్నిసార్లు వెనక్కి తగ్గడం కూడా మంచిదే. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదంటారు కదా. అలాగే ఇప్పుడు వైసీపీ కూడా ఓ విషయంలో కాస్త వెనక్కు తగ్గాలని నిర్ణయించినట్టు అనిపిస్తోంది. కొంత కాలంగా జగన్ సర్కారుకు న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ జరుగుతోందా అన్నట్టుగా సీన్ క్రియేట్ అయ్యింది. ఏపీ హైకోర్టులో కొన్ని రోజులుగా వరుసగా సర్కారుకు ఎదురు దెబ్బలు తగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా న్యాయ వ్యవస్థపై ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

 

దీంతో ఈ పరిణామాన్ని టీడీపీ అందిపుచ్చుకుంది. ఈ విషయంలో కోర్టుల్లో కేసులు వేయించింది. కొందరు వైసీపీ నాయకులకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఏకంగా స్పీకర్ కూడా న్యాయవ్యవస్థపై కాస్త ఘాటుగానే మాట్లాడినట్టు కథనాలు వచ్చాయి. వీటి ద్వారా ఓవరాల్ గా జగన్ సర్కారు న్యాయవ్యవస్థను లెక్కచేయడం లేదనే రేంజ్‌లో ప్రచారం ఊపందుకుంది.

 

 

ఈ విషయంలో వైసీపీ కాస్త ఆలస్యంగా మేలుకొంది. ఇలాంటి ప్రచారం పార్టీకి మంచిది కాదని గుర్తించినట్టుంది. అందుకే ఆ పార్టీలోని కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కోర్టులు, చట్టాలంటే మాకు అపార గౌరవం. మేమెప్పుడూ కోర్టులపై కామెంట్‌ చేయలేదు.. అంటూ వివరణ ఇచ్చారు. పది రోజులుగా జరుగుతున్నవి గమనిస్తే కార్య నిర్వాహక వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఏదో జరుగుతున్నట్లుగా టీడీపీ సృష్టించే ప్రయత్నం చేస్తోందని సజ్జల ఆరోపించారు.

 

 

కోర్టులు, ప్రభుత్వం, సీఎం వైయస్‌ జగన్‌కి సంబంధించి టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరుతున్నామన్నారు సజ్జల. సీఎంవైయస్‌ జగన్‌ ఏ రోజైనా వ్యవస్థలపై ఒక్క మాటైనా అన్నారా? ఎప్పుడైనా మాట తూలారా? తాను చెప్పనివి కూడా అమలు చేసి తిరిగి ప్రజల వద్దకు వెళ్లాలనే సంకల్పంతో జగన్ పని చేస్తున్నారు.. అంటూ సజ్జల కామెంట్ చేయడం చూస్తుంటే.. న్యాయవ్యవస్థపై ఘర్షణ వైఖరి మంచిది కాదని వైసీపీ గుర్తించినట్టే అనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: