లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 60రోజుల‌కుపైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరిగి పునఃప్రారంభించే విష‌యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన‌వ‌స‌ర‌మైన రిస్క్ తీసుకుంటోందా..? అంటే ప‌లువురు విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. రోజురోజుకూ దేశ‌వ్యాప్తంగా రికార్డుస్థాయిలో క‌రోనా వైర‌స్‌పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న త‌రుణంలో టీటీడీ దుస్సాహ‌సం చేస్తోంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే..  మొదట ఈ నెల 8 నుంచి‌ ట్రయల్‌ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. ఇది విజ‌య‌వంతం అయితేనే.. ముందుకు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీటీడీ ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ అనుమతి తెలియజేస్తూ మంగళవారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేయాలని పేర్కొన్నారు.

 

ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడు రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌గా దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ట్రయల్‌ రన్‌ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సమ్మతి తెలియజేసినట్లు జేఎస్వీ ప్రసాద్‌ తెలిపారు. అనంతరం 10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశముందని టీటీడీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. భ‌క్తుల ద‌ర్శ‌నం సంద‌ర్భంగా టీటీడీ అనేక కండిష‌న్లు విధించేందుకు అవ‌కాశం ఉంది. భక్తులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొద‌ట రోజుకు 8వేల నుంచి 10వేల మంది భక్తుల వరకు శ్రీవారి దర్శనం కల్పిస్తారట‌.

 

అనంతరం 20వ తేదీ నుంచి సుమారు 30 వేల మంది భక్తులను అనుమతించే అవకాశం ఉంది. అలాగే, అలిపిరి నుంచి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, సర్వదర్శనాలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. అలిపిరి, మెట్ల మార్గంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు. పుష్కరిణిలో మాత్రం స్నానాలకు భక్తులకు అనుమతిలేదు. ఇదిలా ఉండ‌గా.. తిరుపతి అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. అయితే.. ఏపీలో కూడా క‌రోనా వైర‌స్ ఇప్పుడిప్పుడే నియంత్ర‌ణ‌లోకి వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ వేల సంఖ్య‌లో భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తికి వ‌చ్చేందుకు అనుమ‌తి ఇస్తే ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌నే ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: