ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రత్యేకించి కొన్నిచోట్ల వందల సంఖ్యల్లో కేసులు వెలువడుతున్నాయి. వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ కరోనాకు హాట్ స్పాట్ గా మారుతోంది. ఇటీవల ఈ గ్రామంలో కరోనాతో ఒకరు మరణించారు కూడా. ఇప్పటి వరకూ ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 117 మందికి కరోనా సోకడం జిల్లా వాసుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

 

 

గొల్లల మామిడాడ పేరు కే గ్రామం. కానీ చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 5 వేలకుపైగానే కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 21 వేల జనాభా ఉంది. ఈ ఒక్క గ్రామంలోనే ఇప్పటి వరకూ వందకు పైగా కరోనా పాజిటివ్ కేసుల బయటపడటంతో జనం భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ మొదట నుంచి కరోనా అదుపులోనే ఉన్నా... ఇటీవల ఓ హోటల్‌ తెరిచారు. ఆ హోటల్ నిర్వాహకుల కారణంగానే ఇంత మందికి కరోనా వచ్చిందన్న వాదన ఉంది.

 

 

జిల్లా కలెక్టర్‌ ఇక్కడ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కట్టడి ప్రాంతంగా మార్చి రాకపోకలు నిలిపివేశారు. 5,300 కుటుంబాలు.. 21వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో గుండెలు అరచేత పట్టుకున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోనూ కరోనా విజృంభిస్తోంది. మంగళవారానికి జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరింది.

 

 

వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల్లో వైరస్‌ బయటపడుతోంది. అయితే స్థానికుల వాదన మరోలా ఉంది. అధికారులు తక్కువ కేసులే లెక్కల్లో చూపుతున్నారని.. వాస్తవానికి ఇంకా చాలా కేసులు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా సామాజిక వ్యాప్తి వరకూ వెళ్లకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే.. పరిస్థితి చేయిదాటే ప్రమాదం కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: