మొన్న విజయవాడలో రెండు గ్రూపులు కత్తులు, రాళ్లతో కొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో సందీప్ అనే తెలుగుదేశానికి చెందిన నాయకుడు చనిపోయాడు కూడా. అయితే ఈ గ్యాంగ్ వార్ ఓ అపార్ట్ మెంట్ విషయంలో వచ్చిన గొడవ కారణంగా జరిగిందని మొదట భావించారు. అయితే తాజాగా విచారణలోమరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. ఆస్తి తగాదాలు, ఆధిపత్య పోరు ఈ గొడవకు కారణమే అయినా.. అసలు వివాదం ముదరడానికి టిక్ టాక్ కూడా కారణమని చెబుతున్నారు.

 

 

గొడవకు దిగినవారి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఎకౌంట్లు పరిశీలించిన వారికి ఈ గొడవకు టిక్ టాక్ తక్షణ కారణంగా ఓ అంచనాకు వచ్చారు. సరిగ్గా దాడి జరగటానికి ముందు రోజు ఓ వర్గ నాయకుడు మణికంఠ టిక్‌టాక్‌ చేశాడట. అది సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడట. అసలే కొంతకాలంగా తోట సందీప్‌, మణికంఠ ముఠాల మధ్య ఆర్థిక లావాదేవీలతోపాటు ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీనికి ఈ టిక్ టాక్ ఆజ్యం పోసిందట.

 

 

ఆ తర్వాతే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారట. ఇంకా విచారణలో తేలిందేమంటే.. ఈ సందీప్, మణికంఠ మొదట్లో కలిసే సెటిల్‌మెంట్లు చేసేవారట. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకునేవారట. సందీప్ ఏరియాలో సెటిల్‌ మెంట్‌ చేయాలంటే మణికంఠను పిలిచేవాడట. మణికంఠ ఏరియాలో సెటిల్ మెంట్ చేయాలంటే సందీప్ వెళ్లేవాడట. అలా ఒకరికొకరు సహకరించుకునేవారట.

 

 

కానీ.. ఇటీవల ఇద్దరిమధ్య గొడవలు తలెత్తాయట. దానికి ఈ టిక్ టాక్ కూడా మరికొంత ఆజ్యం పోసిందట. ప్రస్తుతం పోలీసులు సందీప్‌, మణికంఠకు సంబంధించిన టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లలో ఉన్న కొందరిని విచారిస్తున్నారట. ఆదివారం పటమటలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సందీప్ చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. రెండు గ్రూపులు రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్న వీడియోలు ఒళ్లు జలదరింపజేశాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: