తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆ పార్టీకి చెందిన ప్ర‌తి ఘ‌ట్టంలోనూ కీల‌క పాత్ర పోషించిన ముఖ్య‌నేత‌, తెలంగాణ‌ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేటితో 49వ వసంతంలోకి అడుగిడారు. టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్ రావుకు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, హరీశ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న బావ‌మరిది, తెలంగాణ మంత్రి కేటీఆర్, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య క‌విత‌‌ ట్విట్టర్‌ ద్వారా ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే, వీరి పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల కంటే ముందే హ‌రీశ్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

 

త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా హ‌రీశ్ రావు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ``మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ సారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో మనమంతా స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఙప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఙతలు`` అని రెండు చేతులు జోడించి వేడుకున్నారు. స‌హ‌జంగానే కీల‌క స‌మ‌యంలో హ‌రీశ్ రావు స్పందించిన తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంది.


కాగా, మంత్రి కేటీఆర్ త‌న మేన‌బావ‌కు ట్విట్ట‌ర్లో శుభాకాంక్ష‌లు తెలిపారు. ``ఆర్థికశాఖ మంత్రి, డైనమిక్‌, కష్టజీవి.. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ప్రజా సేవలో సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నా బావా అని అన్నారు. రాజకీయంగా గానీ, ప్రభుత్వ ఫోరంలలో గానీ మీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది` అని పేర్కొన్నారు. ఇక మాజీ ఎంపీ క‌విత సైతం అదే రీతిలో త‌న బావ‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. `జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బావ‌` అంటూ ట్వీట్ చేసిన ఆమె గ‌తంలో హ‌రీశ్‌కు తిల‌కం పెట్టిన ఫోటోను జ‌త‌చేశారు. కాగా ఈ టీఆర్ఎస్ నేత‌ల సందేశాల‌తో పార్టీ అభిమానులు శుభాకాంక్ష‌ల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: