ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వంపై వివిధ వ‌ర్గాలు చేస్తున్న ప్ర‌చారాన్ని లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని డిసైడ్ అయింది. వివిధ మాధ్య‌మాల్లో సాగుతున్న ప్ర‌చారం విష‌యంలో స్ప‌ష్ట‌మైన అంచ‌నాతో ముందుకు వెళ్లాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని 'స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు'గా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ నియామ‌కం ద్వారా ప్ర‌భుత్వంపై సాగుతున్న ప్ర‌చారం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ముందుకు సాగేలా ఏపీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది.

 


`స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు`‌గా  తాజాగా నియ‌మితులైన వారిలో చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌ రెడ్డి, మల్లాది సందీప్‌ కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌ రెడ్డి, ఐ.నారాయణ రెడ్డి, జి.దశరథరామి రెడ్డి, వై.రాజశేఖర్ ‌రెడ్డి ఉన్నారు. వీరంతా నిరంతరం సమాచారం, కథనాలపై నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిస్తారు. ఈ బృందం సభ్యులను గతంలో 'సాంకేతిక సమన్వయకర్తలు'గా ప్రభుత్వం నియమించగా..తాజాగా వారి పోస్టుల్ని 'రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు'గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది.

 

కాగా, ప్ర‌భుత్వంపై వివిధ వ‌ర్గాలు సోష‌ల్ మీడియాలో ఉద్దేశ‌పూర్వ‌కంగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో మంచి ఎక్కువ ఉన్న‌ప్ప‌టికీ దాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో అలాంటి వారిపై త‌గు నిఘా పెట్టేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్దం అవుతుండ‌టంలో భాగ‌మే ఈ నియామ‌కం అని పేర్కొంటున్నారు. ప్ర‌భుత్వంపై చేసే వివిధ ర‌కాల ప్ర‌చారాల విష‌యంలో అభ్యంతరాలు ఉంటే త‌గు రీతిలో ముందుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: