ఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 23 కేసులు నమోదు కాగా వీరిలో ఎక్కువ మంది కూరగాయల మార్కెట్ వ్యాపారులే ఉండటం గమనార్హం. నగరంలో రోజుల వ్యవధిలోనే 26 మంది కూరగాయల వ్యాపారులు కరోనా భారీన పడటం జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కూరగాయల వ్యాపారులకు కరోనా సోకడం కోయంబేడు మార్కెట్ లింకులను తలపిస్తోంది. 
 
నగరంలోని హోల్ సేల్ మార్కెట్ వ్యాపారులు కరోనా భారీన పడటంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు నగరంలో ఉన్న కొల్లి శారదా మార్కెట్ ను నెల రోజుల క్రితం బస్టాండ్ నుంచి ఏటుకూరు రోడ్ కు తరలించారు. అప్పటికే ఆ ఏరియాలో బొంతపాడు మార్కెట్ ఉంది. ఈ రెండు మార్కెట్లలో దాదాపు 450 మంది వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. వీరిలో మొదట ముగ్గురు, ఆ తర్వాత ఐదుగురు, తాజాగా 18 మంది కరోనా భారీన పడ్డారు. 
 
దీంతో అధికారులు అప్రమత్తమై కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. నిన్న నమోదైన 23 కేసులలో కొల్లి శారదా మార్కెట్ వ్యాపారులు 18 మంది ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాటికి జిల్లాలో 529 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతున్నా రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 48 శాతం ఉండగా ఏపీలో కరోనా రికవరీ రేటు 69 శాతం ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: