దేశ స‌రిహ‌ద్దుల్లో మ‌రోమారు ఉద్రిక్త‌త త‌లెత్తుతోంది. లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వ‌ద్ద చైనా కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. టిబెట్‌లో రాత్రి పూట చొర‌బాటు విన్యాసాలు చేప‌ట్టిన‌ట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది.  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీలో భాగ‌మైన టిబెట్ మిలిట‌రీ క‌మండ్ ద‌ళాలు.. హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో సైనిక శిక్ష‌ణ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.  సుమారు 4700 మీట‌ర్ల ఎత్తులో ఈ విన్యాసాలు చోటుచేసుకున్నాయి. చాలా దుర్భ‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పీఎల్ఏ సైనికులు త‌మ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఈ విష‌యంలో తాపీగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు దేశాల  మ‌ధ్య ఉన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు జూన్ ఆర‌వ తేదీన ఇరు దేశాలు చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

 


వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న ల‌డాఖ్‌, సిక్కీం ప్రాంతాల్లో ప‌లుసార్లు రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. టిబెట్‌లోని తంగుగుల ప‌ర్వ‌తాల్లో రాత్రి ఒంటి గంట‌కు పీఎల్ఏ ద‌ళాలు సైనిక శిక్ష‌ణ‌లో పాల్గొన్న‌ట్లు చైనా క‌థ‌నం ద్వారా తెలుస్తోంది. డ్రోన్లు, పేలుడు ప‌దార్థాలు కూడా వాడిన‌ట్లు స‌మ‌చారం. శిక్ష‌ణ స‌మ‌రంలోనూ భారీ స్థాయిలో మోటార్ షెల్స్‌, రైఫిల్ గ్రేనేడ్లు, రాకెట్లు వాడిన‌ట్లు చైనా మీడియా పేర్కొంది. దీనిపై  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆచి తూచీ స్పందించారు. లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను దాటి చైనా బలగాలు ‘గణనీయ సంఖ్య’లోనే మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని ఆయ‌న మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తత సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు దేశాల మిలిటరీ అధికారులు ఈ నెల 6న భేటీ కానున్నారని, భారత్‌ తన స్థానం నుంచి వెనుకకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లడఖ్‌లోని తూర్పు ప్రాంతాలు తమవని చైనా వాదిస్తున్నదని, భారత్‌ కూడా ఈ భాగం తమదేనని నమ్ముతున్నదన్నారు. ఈ క్రమంలో భారత్‌ చేయాల్సింది చేస్తుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: