క‌రోనా క‌ల‌క‌లం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉధృతంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ భార‌త‌దేశంపై ఓ రేంజ్‌లో ప‌డుతోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సంక్షోభం తమ ఆర్థిక పరిస్థితిని దారుణంగా దిగజార్చిందని భార‌తీయులు వాపోతున్నారు. తాజాగా ఈ విష‌య‌మే వెల్ల‌డైంది. డిజిటల్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఇండియా లెండ్స్‌' 5 వేల మందితో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ప‌లువురు కీల‌క విష‌యాలు పంచుకున్నారు. ఈ స‌ర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 82 శాతం మంది భారతీయులు త‌మ ప‌రిస్థితి దారుణంగా దిగ‌జారిపోతోంద‌ని వాపోయారు. దేశంలోని ఆర్థిక క‌ష్టాల‌కు ఈ ప‌రిస్థితి నిద‌ర్శ‌నం అని ‘ఇండియా లెండ్స్‌` పేర్కొంది.

 


ఇంటా బ‌య‌ట డ‌బ్బును ఆచి తూచి ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితికి భార‌తీయులు చేరిపోయార‌ని ‘ఇండియా లెండ్స్‌`స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దాదాపు 90 శాతం మంది తమ ఆర్థిక భవితవ్యం, పొదుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘ఇండియా లెండ్స్‌' వ్యవస్థాపక సీఈవో గౌరవ్‌ చోప్రా తెలిపారు. ఆరోగ్య అవసరాలు, విద్యకు సంబంధించిన ఫీజులు, ఇళ్ల మరమ్మతులతో పాటు అప్పులు తీర్చేందుకు, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఇతర ఖర్చులకు ప్రస్తుతం చేతిలో డబ్బు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని 82 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారని గౌర‌వ్ వెల్ల‌డించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు వ్యక్తిగత రుణాలను స్వీకరించాలని భావిస్తున్నట్టు దాదాపు 72 శాతం మంది స్పష్టం చేశారు. రానున్న కొన్ని నెలలపాటు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తామని 95 శాతం మంది.. ఖర్చులను తగ్గించుకొంటామని 84 శాతం మంది ఈ వెల్లడించారు. 

 

మ‌రోవైపు ఇంకో విష‌యంలోనూ మ‌న దేశంలో ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. కరోనా సంక్షోభంతో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పెట్టుబడులకు కూడా గండి కొడుతోంది. ప్రస్తుతం తాము కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే స్థితిలో లేమని ఈ సర్వేలో 76 శాతం మంది స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. నిత్యావసర వస్తువుల కొనుగోలుపై ఎక్కువగా దృష్టిసారిస్తామని 40 శాతం మంది.. నిత్యావసరేతర వస్తువులతోపాటు వినోదాలకు, విలాసాలకు తక్కువ సొమ్మును వెచ్చిస్తామని 70 శాతం మంది ఈ సర్వేలో పేర్కొన్నట్టు గౌరవ్‌ చోప్రా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: