దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వైరస్‌ బాధితుల సంఖ్య రెండులక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. అయితే కరోనా లెక్కలపై కేంద్రం చెబుతున్న లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇంతకీ కొవిడ్‌ డెత్స్‌ పై కేంద్రం చెబుతున్న గణాంకాలను ఓ సారి పరిశిలిస్తే.. 

 

దేశవ్యాప్తంగా దాదాపుగా లాక్‌డౌన్‌ ఎత్తేశారు. కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ 5.0గా చెప్పినప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసి మిగతా ప్రాంతాల్లో ఆంక్షల్ని సడలించేసింది. అలాగని దేశంలో వైరస్‌ ప్రభావం తగ్గిందనుకుంటే పొరపాటే. అసలిప్పుడే వీరవిహారం మొదలెట్టింది కరోనా. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. మరణాల సఖ్యం ఆరువేలకు దగ్గర్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

 

అయితే దేశంలో కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం భిన్నమైన వాదన వినిపిస్తోంది. దేశంలో కరోనా ప్రభావానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ... మరణాల శాతం తక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. 24 గంటల్లో 3వేల 708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతంగా ఉందని.. క్రమంగా రికవరీ రేటు పెరుగుతోందని చెప్పింది.

 

కరోనాతో సంభవిస్తున్న మరణాల్లో 73 శాతం మందికి.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్‌ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82శాతంగా ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువని ప్రకటించింది. భారత్‌లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని, కోలుకుంటున్నవారి సంఖ్య లక్షకు చేరువలో ఉందని తెలిపింది. దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. 

 

రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉందో విశ్లేషించాలని ఆయా ప్రభుత్వాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. కొవిడ్‌ వైద్యం కోసం తాత్కాలిక ఆస్పత్రులు అవసరమైతే ఏర్పాటు చేసుకోవచ్చంది. కాగా, ఇప్పటివరకు దేశంలో 95వేల 527 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయినట్టు ప్రకటించింది.డిశ్చార్జి అయ్యారని... రికవరీ రేటు 48.07 శాతం ఉందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: