జనం భయపడినట్టే జరుగుతోంది. నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. ఎల్ జీ పాలిమర్ భూతం ప్రాణాలు తోడేస్తోంది. స్టైరీన్ గ్యాస్ బారినపడ్డ బాధితులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. దీంతో ఇక్కడివారి ఆరోగ్య భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. కంపెనీని పూర్తిగా మూసేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. 

 

విశాఖను ఎల్జీ పాలిమర్ ప్రమాదం అతలాకుతలం చేసింది. పరిశ్రమను ఆనుకుని వున్న ఐదు గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది. స్టైరీన్ గ్యాస్ విస్తరించిన 10కిలోమీ టర్ల పరిధిలో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఎల్జీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిన రోజే 12మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.  ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్‌ తీసుకుని ఇళ్లకు వెళ్లినవారు తిరిగి రోగాలబారిన పడుతున్నారు.  ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు. 

 

ఎక్కువ మోతాదులో గ్యాస్‌ పీల్చడం వల్ల తీవ్ర మైన ఆరోగ్య సమస్యలు ఎదురై ఇటీవలే  పాల వెంకాయమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. ఇప్పుడు యలమంచిలి కనకరాజు అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో వెంకటాపురంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరోవైపు వీరిద్దరి పోస్టుమార్టం నివేదికల ఆధారంగా పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మరో ఇద్దరు చనిపోవడం...  ఇంకొందరిని అనారోగ్యం వెంటాడుతుండడంతో వెంకటాపురం గ్రామం భయం మధ్య బతుకుతోంది. 

 

స్టైరీన్ భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలు, వ్యాధుల పట్ల టెన్షన్‌ పెరుగుతోంది.  ఈ తరహా గ్యాస్ లీక్ ఘటన దేశంలో జరగడం ఇదే మొదటిసారి. దీంతో గ్యాస్‌  ప్రభావం ఎంత దూరం వరకూ వ్యాపించిందనేది నిర్ధిష్టమైన అంచనా లేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రభావిత ప్రాంతాల పరిధిని పెంచుకుంటూ వెళ్లింది. పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజానీకం ఆరోగ్య పరిస్థితులు సమీక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తీవ్రత ఎలా ఉంటుందో తాజా నివేదికలే నిదర్శనమని అంటున్నాయి. 

 

అటు ప్రమాదం జరిగిన ఇన్ని రోజుల తర్వాత మళ్లీ  కొందరు చనిపోతుండడం ఇటు ప్రభుత్వ వర్గాల్ని కూడా కలవరపెడుతోంది. దీర్ఘకాలంలో ఎదుర య్యే ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించింది. వెంకటాపురంలో శాశ్వతంగా వైఎస్ఆర్ క్లీనిక్ ఏర్పాటు చేయబోతోంది. 

 

మొత్తంగా చూస్తే ఓవైపు ప్రాణాలు పోతుండడం... మరోవైపు అనారోగ్య సమస్యలు పెరుగుతుండడంతో ఈ ప్రాంతాన్ని స్టైరీన్‌ భయం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: