పాకిస్తాన్ భార‌త్‌ను అనుస‌రిస్తోంది. ఇక ఎంత‌మాత్రమూ పాకిస్తాన్లో లాక్‌డౌన్‌ను కొన‌సాగించ‌లేమ‌ని  ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.గురువారం జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. శనివారం నుంచి క్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ఆర్థిక న‌ష్టం నుంచి గ‌ట్టెక్కించేందుకే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.లాక్ డౌన్ తో ఎలాంటి ఉపయోగం లేదని, వైరస్ ను అది అరికట్టలేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్ తో కలిసి జీవించాలని అన్నారు. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నగదు బదిలీ చేశామని తెలిపారు. 

 

ఇన్నాళ్లు సాయం అందించాం....ఇక‌పై స‌హాయ కార్య‌క్ర‌మాలు అందించ‌లేని ప‌రిస్థితి ఉంది. ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని సూచించారు. వైద్య స‌దుపాయాల మెరుగుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.  త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.  లాక్‌డౌన్‌తో పూర్తిగా కరోనాను పార‌దోల‌లేమ‌ని, వ్యాక్సిన్ వచ్చేంత వరకు అది విస్తరిస్తూనే ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జ‌ల ముంద‌స్తు జాగ్ర‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించ‌డ‌మే అతిపెద్ద మంద‌ని అన్నారు. మాస్కును ధ‌రించ‌డం అనేది సంప్ర‌దాయంగా మారాల‌ని పిలుపునిచ్చారు. క‌రోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు.

 

ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో పాకిస్తాన్‌లో కొత్తగా మరో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24,644కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 6,464 మంది కోలుకోగా..ఇప్పటివరకు 585 మంది మ‌ర‌ణించారు. పాక్‌లో నమోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా సింద్‌, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ ఆర్థిక వ్య‌వ‌స్త చిన్నాభిన్నంగా మారింది. పాకిస్తాన్ కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: