గత కొన్ని సంవత్సరాలుగా జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో "ఇక్కడ జనరిక్ మందులు లభించును" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ డ్రగ్స్ వెల చాలా తక్కువ. సాధారణంగా ఎవరైనా ఒక మందును తయారు చేస్తే వారికి ఆ మందుపై 20 సంవత్సరాల పేటెంట్ హక్కులు ఉంటాయి. 
 
20 సంవత్సరాల తరువాత ఇతర సంస్థలు కూడా అదే కాంబినేషన్ తో మందులను తయారు చేయవచ్చు. పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపెనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయవచ్చు. అదే కాంబినేషన్ తో తయారైన జనరిక్ మందులు మరింత క్వాలిటీతో ప్రభుత్వ పర్యవేక్షణలో తయారవుతాయి. 
 
అందువల్ల జనరిక్ డ్రగ్స్ వినియోగిస్తే తక్కువ ధరకే మందులు లభ్యం కావడంతో పాటు బాగా పని చేస్తాయి. జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిని ఎమ్మార్పీ కంటే కూడా చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. 
 
బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటించడం జరుగుతుంది. అయితే కొందరు జనరిక్ మందులు అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు కానీ జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి. జనరిక్ మందులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోతే మందుల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీర్ఘకాలపు మందులు వాడేవారు బ్రాండెడ్ డ్రగ్స్ కంటే జనరిక్ డ్రగ్స్ ను వాడటం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: