జార్జ్ ఫ్లాయిడ్ మృతితో రగిలిన అశాంతి దావానలంలా అమెరికాను దహిస్తోంది. దీనికితోడు అధ్యక్షుడు ట్రంప్ దురుసు మాటలతో ఆజ్యం పోస్తుండడంతో... పరిస్థితి మరింత విషమిస్తోంది. మరోవైపు ట్రంప్ పోస్టుల వ్యవహారం.. ఫేస్ బుక్ యాజమాన్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ట్రంప్ వివాదాస్పద ఎఫ్బీ పోస్టుల పట్ల ... యాజమాన్యం ఉదాసీనంగా ఉండడంపై.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

జార్జి ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో మొదలైన నిరసనలు తీవ్రరూపు దాల్చాయి. ఎన్నాళ్లీ వర్ణవివక్ష అంటూ రోడ్లపైకి వచ్చిన జనం.. హింసాత్మక ఘటనలకు దిగుతున్నారు. వైట్ హౌస్ దగ్గర భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో.. సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

 

నిరసనల పేరుతో అమర్యాదకర ఘటనలు జరుగుతున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావని మండిపడ్డారు ట్రంప్. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించారు. ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు.  అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని మండిపడ్డారు.

 

అయితే.. హింసను ప్రేరేపించేలా ఉన్న ట్రంప్ పోస్టుల విషయంలో సంస్థ యాజమాన్యం ఉదాసీనంగా ఉండటం పట్ల ఫేస్‌బుక్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో సంస్థ సీీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. మార్క్‌ను వారు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపాలనే అర్థం వచ్చేలా ట్రంప్ పెట్టిన పోస్టు ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో ఉండటం పట్ల అనేక మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ నిబంధనల ప్రకారం ఆ పోస్టు హింసను ప్రేరేపించేలా ఉందని నిరూపించలేక పోతున్నామని మార్క్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. వాటిని పూర్తిగా తొలగించే బదులు ఇతర మార్గాల్లో వినియోగదారులను హెచ్చరించేందుకు మార్గాలను అన్వేషించాలని మార్క్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ అనుసరిస్తున్న విధానంలో మార్పులు తీసుకొచ్చే విషయాన్నికూడా పరిశీలిస్తున్నట్టు మార్క్ చెప్పినట్లు తెలుస్తోంది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం.. ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించలేకపోయిందని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: