ఇండియా పేరు భారత్ గా మార్చాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో  కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే రాజ్యాంగంలో భారత్ అనే పేరుందని, ఇప్పుడు కొత్తగా తాము చేయగలిగింది ఏమీ లేదని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 1 ను తాము సవరించలేమని స్పష్టం చేసింది. 

 

ఇండియా పేరును భారత్‌ లేదా హిందుస్థాన్ అని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉందని పిటిషనర్‌కు చెప్పారు. ఈ విషయంలో కావాలనుకుంటే కేంద్రం వద్దకు వెళ్లాలని సూచించారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు పిటీషన్ పంపవచ్చని సూచన చేసి.. పిటిషన్ కొట్టేశారు. 

 

ఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్ అని మార్చడం వల్ల ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయ భావం పెంపొందుతాయని ఢిల్లీకి చెందిన పిటిషనర్ వాదించారు. దేశం పేరు మార్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఇండియా అనేది ఇంగ్లీష్ పదమని, స్వదేశీ భాషలో పెడితే దేశ ప్రజలకే గర్వకారణంగా ఉంటుందని పిటిషనర్ సూచించారు. ఇండియా పేరు ఇండికా అనే గ్రీకు పదం నుంచి తీసుకున్నారని చెప్పారు. 1948లోనూ భారత్ లేదా హిందూస్థాన్‌లో ఏదో ఒక పేరు పెట్టాలనే వాదన వచ్చిందని పిటిషనర్ గుర్తు చేశారు. 

 

దేశంలో పలు నగరాల పేర్లు మార్చి.. వాటి పాత పేర్లు పెడుతున్న ఈ తరుణంలో.. ఇండియా అనే పేరు కూడా భారత్ గా మార్చడం మంచిదని పిటిషనర్ చెప్పారు. ఇండియా కంటే భారత్ అనే పేరు వాడుకలో ఉంటే.. భావితరాలకు కూడా దేశం గొప్పతనం తెలుస్తుందని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల ఆకాంక్ష నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే  ఆర్టికల్ వన్ సవరించే పని సుప్రీంకోర్టు చేయలేదన్న సీజేఐ.. పిటిషన్ కొట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: