భారత్ చైనా వివాదం గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికాలో నల్ల జాతీయుల నిరసనల నేపథ్యంలో నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య అరగంట పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ ఫోన్ కాల్ లో ట్రంప్ చైనాతో భారత్ సరిహద్దుల వివాదం గురించి అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. గతంలో ట్రంప్ ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా ఉండి సమస్యను పరిష్కరిస్తానని రెండుసార్లు చెప్పారు. 
 
భారత్ మాత్రం సమస్యలను తమంతట తామే పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పింది. భారత్ చైనా వివాదం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పరోక్షంగా చైనాను హెచ్చరించడానికే మోదీ ట్రంప్ తో ఈ విషయం గురించి చర్చించాడా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రంప్ ఫోన్ చేసి మోదీతో సరిహద్దు వివాదం గురించి మాట్లాడటాన్ని చైనా కూడా జీర్ణించుకోలేకపోతున్నది. 
 
చైనా కూడా భారత్ చైనా సరిహద్దు వివాదం విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇదే సమయంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనాకు చెందిన విమానాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడి పరిపాలనా విభాగం ఈ నెల 16 నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు అమలులోకి రానున్నాయని తెలిపారు. 
 
కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది మొదట్లో చైనాలోని వుహాన్ కు అమెరికా తమ దేశానికి చెందిన విమానాల రాకపోకలను నిలిపివేసింది. అయితే జూన్ 1 నుంచి రెండు విమానయాన సంస్థలు సేవలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. అయితే చైనా వీటికి అనుమతులు మంజూరు చేయకపోవడంతో అమెరికా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా రవాణాశాఖ అధికారులు విమానాల రాకపోకలపై జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని... చైనా ఎన్ని విమానాలను అనుమతిస్తుందో అదే స్థాయిలో చైనా విమానాలను అమెరికా అనుమతిస్తుందని కీలక ప్రకటన వెలువడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: