దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వైరస్ తుమ్ము, దగ్గు, నోటి తుంపరల ద్వారా, అవతలి వ్యక్తిని నేరుగా తాకడం ద్వారా వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల బయటకు వెళ్లి వచ్చిన తరువాత చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. 
 
చేతులను కడగకుండా ముఖం, కళ్లు, నోటిని ముట్టుకోకపోవడమే మంచిది. మరోవైపు ప్రతిరోజూ కొన్ని లక్షల మంది చేతులు మారే కరెన్సీ నోట్లతో కరోనా సోకుతుందని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేకపోవడంతో చిరు వ్యాపారులు, కూరగాయల కొనుగోలు సమయంలో తప్పకుండా నోట్లు వాడాల్సి వస్తుంది. దీంతో నోట్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని కొందరిలో భయాందోళన నెలకొంది. 
 
కరెన్సీ నోట్లు, నాణేల ద్వారా కరోనా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసినా కొందరు కరెన్సీ నోట్లకు లాలాజలాన్ని అంటించి రోడ్లపై పడేస్తూ ఉండటంతో జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కరెన్సీ నోట్లను తాకిన తరువాత చేతులతో ముఖం, కళ్లు, నోటిని ముట్టుకోకూడదు. కరెన్సీ నోట్లను తాకిన తరువాత చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. 
 
డెబిట్, క్రెడిట్ కార్డులను ముట్టుకున్న తర్వాత కూడా చేతులు శానిటైజ్ చేసుకుంటే మంచిది. ఏటీఎం కేంద్రాల్లో చాలా మంది నగదు విత్ డ్రా చేస్తారు కాబట్టి ఏటీఎంలోని బటన్స్‌ను టూత్ పిక్‌తో నొక్కి డబ్బులు విత్ డ్రా చేయడం మంచిది. ఏటీఎంలో డోర్లు తెరిచి, మూసిన తర్వాత కూడా చేతులను శానిటైజ్ చేసుకోవడం ఉత్తమం. శానిటైజ్ చేసుకోవడం ద్వారా వైరస్, బ్యాక్టీరియా చనిపోతాయి. వీలైనంత వరకు ఆన్ లైన్ లావాదేవీలకు, డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: