ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, ఆ వెంటనే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్స్ ముగిసిన వెంటనే కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పటి ఎస్‌ఈ‌సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఇక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇష్యూ ఏమైందో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే కొత్తగా వచ్చిన ఎస్‌ఈ‌సి జస్టిస్ కనగరాజ్ కూడా ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాల వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేశారు.

 

అయితే ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరు ఉంటారు అనేది తెలియదు. కానీ నామినేషన్ ప్రక్రియ అయ్యాక చాలామంది అభ్యర్ధులు తమ తమ స్థానాల్లో యాక్టివ్ గా పనిచేసుకుంటూ, ఓటర్లని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో కూడా వైసీపీ ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

 

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ మంత్రి కొడాలి నాని గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సైలెంట్‌గా ఈ జెడ్‌పి‌టి‌సి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. మామూలుగా గుడ్లవల్లేరు మండలం టీడీపీకి కంచుకోట. ఎప్పుడు ఈ జెడ్‌పి‌టి‌సి స్థానం టీడీపీ ఖాతాలోనే పడుతుంది. 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం టీడీపీకే దక్కింది.

 

పైగా ఇప్పుడు గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి బరిలో ఉన్న వైసీపీ అభ్యర్ధి ఉప్పాల హారికనే...కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్ధి. దీంతో ఆమె గెలుపుని కొడాలి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఈ మండలంలో ఉప్పల ఫ్యామిలీ ఎప్పటి నుంచో తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. లాక్ డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. నిత్యం మండలంలో ఏదొక సహాయ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్ధి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇక ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగిన ఇక్కడ వైసీపీ విజయం పక్కా అని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: