మనుషులకు ఆధార్ ఉన్నట్లు గానే.. భూములకు కూడా గుర్తింపు ఉండాలనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి భూధార్ అనే కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలకు ఆధార్‌ కార్డు అమలు చేస్తు న్న విధంగానే...ఆంధ్రప్రదేశ్ లో భూమికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును తీసుకురానున్నారు. ఈ విధానం ద్వారా భూముల విషయంలో అక్రమాలు జరిగే అవకాశాలు తగ్గుతాయని, ఒకవేళ ఎక్కడైనా అవకతవకలు జరిగినా వాటిని వెంటనే గుర్తించడానికి అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకే జ‌నంలోకి తోంద‌ర‌గా వెళ్లేందుకు వీలుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్రభుత్వం భూధార్‌గా నామకరణం చేసింది. రాష్ట్రమంతా సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


 ప్రతీ భూమిని గుర్తించి వాటికి ‘భూధార్’ నెంబర్ కేటాయించాలని సూచించారు. రాష్ట్రంలో భూధార్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తీసుకువస్తున్న‌ట్లుగా  రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఈమేర‌కు జీవో జారీ చేశారు. పూర్తి పార‌ద‌ర్శ‌కత‌త‌తో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటివ్ రిఫరెన్స్ స్టేషన్స్(కార్స్) టెక్నాలజీ ద్వారా భూములను రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటిదశ పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తొలుత రీసర్వే చేయనున్నారు.  భూముల వివరాలు స్పష్టంగా, ఖచ్చితంగా ఉండేందుకు గాను ఈ విధానాన్నిప్రవేశపెట్టాలని రెవెన్యూ శాఖ యోచిస్తున్నట్లు తెలిసింది. 


ముందుగా దీనిపై ప్రకటన చేసి తదనంతరం పూర్తి స్థాయిలో విధివిధానాల్నితయారుచేయాలని ఆ శాఖ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.ఈ ప‌థ‌కానికి  ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 200.15 కోట్లకు ఆమోదం తెలపాలని సర్వే సెటిల్‌మెంట్‌ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోర‌డం గ‌మ‌నార్హం.ఇప్పటివరకు సర్వే నంబర్ల వారీగా ఉన్న భూముల్ని అన్నింటినీ ఈ కొత్త భూధార్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. భూమి ఎవరి పేరున ఉంది, దాని సరిహద్దులు, ఎంత విస్తీర్ణంలో ఎక్కడ ఉంది, వాటి రిజిస్ట్రేషన్‌ నంబర్లు వంటి వివరాలు అన్ని కూడా  ఈ భూధార్‌తో అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో ఈ భూములపై జరిగే ప్రతి క్రయ విక్రయాలన్నీనేరుగా ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించే అవకాశం ఉంటుంద‌ని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: