ఏపీలో వైసీపీలో ఒక్కో జిల్లాలో ముస‌లాలు మొద‌లు అవుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ సీఎం అయ్యి యేడాది అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ కూడా చిన్న అస‌మ్మ‌తి లేకుండా.. ఎవ్వ‌రి నోరు లెగ‌కుండా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. వాస్త‌వంగా చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు పార్టీపై ప‌ట్టు కోల్పోవ‌డం.. టీడీపీ ఎమ్మెల్యేలు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్ప‌డంతోనే పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఏపీలో యేడాది పాటు కొన‌సాగిన వైసీపీ పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొంద‌రు ఎమ్మెల్యేలు.. సీనియ‌ర్ నేత‌లు పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పేలా మాట్లాడుతున్నారు. ఈ లిస్టులో నెల్లూరు జిల్లా అగ్ర‌స్థానంలో ఉంది. 

 

నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ సీనియ‌ర్ల‌ను కాద‌ని జూనియ‌ర్లు అయిన అనిల్ కుమార్ యాద‌వ్‌, గౌతంరెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో సీనియ‌ర్ ఎమ్మెల్యేలు రగిలి పోతున్నారు. ఇక కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన మంత్రుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డుతోన్న వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చినా కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. రెండు రోజులుగా మంత్రుల తీరుపై విరుచుకు ప‌డ్డ ఆయ‌న మూడు రోజుల్లో పూర్తి వివ‌రాల‌తో ప్రెస్ మీట్ పెడ‌తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

 

నెల్లూరు జిల్లాలో వైసీపీలోనే సీనియ‌ర్ అయిన ఆనం మరోసారి జిల్లా అధికారులు మంత్రుల పై విరుచుకుపడ్డారు. 175 నియోజకవర్గాల్లో 174 మాత్రమే ఉన్నాయా.. వెంకటగిరి లెక్కలో లేదా.20 వేల కోట్లు నిధులు వస్తే వెంకటగిరి కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు. స్వయంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేద‌ని ఆయ‌న వాపోయారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలో ఇటు ప్రధాన మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఆనం ప్ర‌ధాన టార్గెట్ గ‌తంలో ఆయ‌న శిష్యుడు, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాద‌వే అని అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. మ‌రి ఈ వివాదం ఎటు వైపున‌కు దారి తీస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: