ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీకి ఇసుక అంశం పెద్ద సంక‌టంగా మారింది. ఇసుక కొర‌త విష‌యంలో చివ‌ర‌కు సామాన్య ప్ర‌జ‌లు.. విప‌క్షాలే కాదు.. వైసీపీకి చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యే లే త‌మ‌కు ఇసుక దొర‌క‌డం లేద‌ని బ‌హిరంగంగానే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీకే చెందిన గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ఇసుక విష‌యంలో తీవ్రంగా విరుచు కు ప‌డ్డారు. ఇసుక రీచ్ ల నుంచి లోడ్ అయ్యాక బ‌య‌లు దేరిన లారీలు మ‌ధ్య‌లోనే మాయం అవుతున్నాయంటూ జ‌డ్పీ స‌మావేశంలో బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ వ‌ర్గాల్లోనే క‌ల‌క‌లం రేపాయి.

 

ఇక తాజాగా విప‌క్ష టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏపీలో ఇసుక కొర‌త తీవ్ర‌త తెలియ‌జేస్తూ నిర‌స‌న చేప‌ట్టారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు ఇసుక కొర‌త‌పై విభిన్న‌మైన నిర‌స‌న తెలియ‌జేశారు. మార్కెట్లో బంగారం దొరుకుతుంద‌ని కాని ఇసుక దొర‌క‌డం లేదంటూ గ్రామాల్లో గ్రాములో ఇసుక తూకం వేస్తూ అమ్ముతూ నిర‌స‌న తెలిపారు. ఇసుక ప్యాకెట్ల‌పై భార‌తీ ఇసుక అని ముద్రించి ఉన్న ప్యాకెట్ల‌ను ప్యాక్ చేయించి వాటికి జే ట్యాక్స్ అద‌నం అంటూ బండిపై తోసుకుంటూ ఇసుక‌ను అమ్మారు. 

 

ఆయ‌న పాల‌కొల్లు త‌హ‌సీల్దార్ ఆఫీస్ వ‌ర‌కు బండిని తోసుకుంటూ వెళ్లి వినతిప‌త్రం అందేజేస్తూ నిర‌స‌న తెలిపారు. ఫోన్ కొడితే ఇంటికే ఇసుక అన్నార‌ని.. కాని ఇప్పుడు నెల‌లుగా కూడా ఇసుక రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీలో ఎంతో మంది భ‌వ‌న కార్మికులు ప‌నులు లేక ప‌స్తులు ఉంటూ వాళ్ల పిల్ల‌ల‌కు తిండి లేక బాధ‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ర్యాంపుల్లో ఎంతో ఇసుక ఉన్నా ఆ ఇసుక సామాన్యుల‌కు అంద‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: