మన దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి.  మార్చి నెలలో ఈ కేసులు మరింత పెరగడం మొదలు పెట్టడంతో జనతా కర్ఫ్యూ తర్వాత మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  అప్పటి నుంచి దేశం వ్యాప్తంగా రవాణా, వాణిజ్య, ఇతర జనసముదాయాలు మొత్తం మూసి వేశారు. అందులో విద్యాసంస్థలు కూడా పూర్తిగా బంద్ చేశారు. వాస్తవానికి జూన్ మాసంలో విద్యావ్యవస్థ మొదలు కావాల్సి ఉన్నా కరోనా భయంతో అపివేశారు. తాజాగా హర్యానా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దశల వారీగా విద్యాసంస్థలను తెరిచేందుకు తాము ఒక ప్రణాళికను రూపొందించామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌ చెప్పారు.

 

‘ముందుగా 10, 11, 12వ తరగతి విద్యార్థుల కోసం స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆ తర్వాత దశలవారీగా 6 నుంచి 9, 1 నుంచి 5 తరగతులను తెరుస్తాం. అయితే 50 శాతం సామర్థ్యంతోనే పాఠశాలలు నడిపేందుకు అనుమతిస్తాం. ఇది ఒక పద్దతి లో అంటే  ఒక తరగతిలో 30 మంది ఉంటే.. 15 మందికి ఒకపూట, మిగతా 15 మందికి మరోపూట లేదా మరో రోజు తరగతులు నిర్వహించేలా పాఠశాలలను ఆదేశిస్తాం’ అని మంత్రి వెల్లడించారు. అంతే కాదు.. ఆగస్టులో ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని, సెకండియర్‌ తరగతులను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

 

ఇక డిగ్రీ కాలేజీలను కూడా ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని హర్యానా విద్యాశాఖ మంత్రి తెలిపారు. అదేవిధంగా వాయిదాపడ్డ 12వ తరగతి ఫైనల్‌ పరీక్షలను జూలై 1 నుంచి 15 నిర్వహించనున్నామని, పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యాసంస్థల పునఃప్రారంభానికి అవసరమైన మరిన్ని నిర్ణయాలను యూనివర్సిటీలు తీసుకుంటాయని మంత్రి వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: