దేశంలో కరోనా వైరస్ విజృంభణ వల్ల గత కొంతకాలంగా రాజకీయపరమైన విమర్శలు తగ్గాయి. దేశంలోను, తెలుగు రాష్ట్రాల్లోను కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయ విమర్శలు మొదలవుతున్నాయి. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై, సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 
 
ఓటుకు నోటు కేసు భయంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని... వేలకోట్ల విలువైన ఏపీ ఆస్తులను తెలంగాణలో వదిలి కరకట్టకు వచ్చారని విమర్శలు చేశారు. కేసీఆర్‌తో ఉన్న స్వార్ధప్రయోజనాల కోసం సీఎం జగన్ వాటిపై నోరు మెదపడం లేదని అన్నారు. జగన్ ఆస్తులపై నోరు మెదపకుండా వాటిని కేసీఆర్ కే అప్పగించారని వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగా ఏపీకి చెందాల్సిన ఆస్తులపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. 
 
విభజన చట్టం ప్రకారం 2024 వరకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. వైసీపీ, టీడీపీ తెలంగాణలోని ఆస్తుల విషయంలో దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. సెక్షన్ 9, సెక్షన్ 10 ప్రకారం ఏపీకి హైదరాబాద్ లోనీ ఆస్తుల్లో కొన్నింటిలో పూర్తి హక్కులు, కొన్నింటిలో పాక్షిక హక్కులు ఉన్నాయి. పూర్తి హక్కులు ఉన్న చోట్ల ఆస్తిలో వాటా రావాల్సి ఉంది. 
 
తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆస్తులను తీసుకుంటి వాటి వాల్యుయేషన్ ప్రకారం 22,000 కోట్ల రూపాయలు చెల్లించాలని ఒక అంచనా. జగన్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా ఆస్తుల లెక్క ఇంకా తేలలేదు. కన్నా లేవనెత్తిన ప్రశ్నల వల్ల రాష్ట్రంలో ఆ ఆస్తుల గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ ఆస్తుల విషయంలో వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ నేత కన్నా విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు ఆస్తుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: