కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన భూమా అఖిలప్రియ,ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏవీ సుబ్బారెడ్డి...భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడు. అయితే నాగిరెడ్డి చనిపోయాక పరిస్థితులు మారిపోయాయి. సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. చంద్రబాబు, అఖిలప్రియకు మంత్రి  పదవి ఇవ్వడంతో, సుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది.

 

అయితే ఆళ్లగడ్డలో అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలకు అసలు పడేది కాదు. ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉండేది. ఇక సుబ్బారెడ్డి కూడా సమయాన్ని బట్టి అఖిలప్రియపై విమర్శలు చేస్తూ వచ్చేవారు. ఈ క్రమంలోనే సైకిల్ ర్యాలీ చేస్తున్న సుబ్బారెడ్డి వర్గంపై రాళ్లదడి జరిగింది. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ఏవీ సుబ్బారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశాడు. అఖిల ప్రియ పాత్ర ఉంద‌ని, ఆమె క‌నుస‌న్న‌ల్లోనే త‌న‌పై రాళ్ల‌దాడి జ‌రిగింద‌ని, చెబుతూ అధినేతకు కూడా చెప్పారు.

 

దీంతో వీరి ఆధిప‌త్య రాజ‌కీయాలకు చెక్ పెట్టడానికి, చంద్రబాబు..అఖిల, సుబ్బారెడ్డిలని పిలిచి మాట్లాడి, వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే కొన్నిరోజులు మాత్రమే వీరు సైలెంట్‌గానే ఉన్నారు. ఆళ్లగడ్డ సీటు రాకపోయినా సుబ్బారెడ్డి అలాగే పార్టీలో ఉన్నారు. అయితే ఎన్నికలయ్యాక మళ్ళీ రచ్చ మొదలైంది. ఇటీవల సుబ్బారెడ్డిని హతమార్చడానికి చూసిన ఓ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

అయితే వారు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడులు ప్లాన్ అని తాజాగా సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధిస్థానం దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు.

 

ఇక ఈ విషయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు..అఖిలప్రియ వైపే ఉంటారని పక్కాగా తెలుస్తోంది. అయితే ఏవీ కూడా తెలివిగా బాబుని ఇరుకున పెట్టడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాబు వైఖరి తెలిసిపోతుందనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బాబు రియాక్షన్ బట్టి, ఏవీ ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది అనుకుంటా!

మరింత సమాచారం తెలుసుకోండి: