అమెరికా పోలీసుల దుశ్చర్యకు ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌  ఫ్లాయిడ్‌ బలైపోయిన ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. చివరికి మహాత్మాగాంధీ విగ్రహాన్నికూడా ఆందోళనకారులు వదిపెట్టలేదు. రంగు చల్లి మహాత్ముడి విగ్రహాన్ని అవమానించారు. దీన్ని ఖండించిన అమెరికా... క్షమాపణలు కోరింది. అటు... అమెరికన్లను ట్రంప్‌ రెండుగా
చీల్చేందుకు ప్రయత్నించారని... మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ మండిపడ్డారు.

 

జాత్యహంకారంపై 9 రోజులుగా అమెరికా రగిలిపోతూనే ఉంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ పోలీసుల దాష్టీకం కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో... ఐ కాంట్‌ బ్రీత్‌ పేరుతో అగ్రరాజ్యమంతటా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు హోరెత్తిస్తున్నారు. అయితే హింసాత్మక నిరసనలు కాస్తా...
బలగాల మోహరింపుతో శాంతియుత ప్రదర్శనలుగా మారాయి. 

 

వాషింగ్టన్‌ డీసీలో పోలీసులు, ట్రంప్‌ వైఖరిపై నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు... ఒక్కసారిగా భారత రాయబార కార్యాలయం వైపు వచ్చి... అక్కడి మహాత్మాగాంధీ విగ్రహంపై రంగులు చల్లారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే విగ్రహాన్నికవర్‌తో కప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అమెరికా... మహాత్ముడికి జరిగిన అవమానంపై క్షమాపణలు కోరింది. ఘటనపై అమెరికాలోని పార్క్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

అమెరికాలో ప్రస్తుత పరిణామాలపై ఆ దేశ మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ జేమ్స్‌ మాటిస్‌... తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్లను ట్రంప్‌ రెండుగా చీల్చేందుకు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. అమెరికా ప్రజల్ని ఏకం చేసేందుకు ప్రయత్నించని తొలి దేశాధ్యక్షుడు ట్రంపేనని... ఇలాంటి
ప్రెసిడెంట్‌ని తాను జీవితంలో మొదటిసారి చూస్తున్నానంటూ జేమ్స్‌ మాటిస్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 

మెచ్యూరిటీ లేని నాయకత్వం వల్ల మూడేళ్లుగా తలెత్తుతున్న పరిణామాలకు తాము సాక్షులుగా నిలిచామంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్ మృతికి నిరసనగా ఆందోళనకారులు రచ్చరచ్చ చేస్తున్నారు. పోలీసులు నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: