భారత్‌లో మొదట్లో సైలెంట్‌గా ఉన్న కరోనా వైలెంట్‌గా మారింది. నెల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు చేజారిపోయింది. భారత్‌లో కరోనా వేగం అందుకుంది...! రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపవుతోంది..! గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయ్‌.

 

భారత్‌లో కరోనా స్పీడ్‌ పెంచింది. గత కొన్నిరోజులుగా దేశంలో రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయ్. గడచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 9 వేల 304 మందికి కరోనా సోకింది. భారత్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 16 వేల 919కి చేరింది. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతిరోజు 200కు పైగా వైరస్‌ కాటుతో చనిపోతున్నారు. గడచిన 24గంటల్లో అత్యధికంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 6 వేల 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

లక్షా 4 వేల 107 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం లక్షా 6 వేల 737 యాక్టివ్ కేసులున్నాయ్. దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు వెయ్యి మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసులు గత 15రోజుల్లోనే రెట్టింపవ్వగా.. మరణాలు కూడా 17 రోజుల్లోనే డబులయ్యాయ్‌. మే 18న 3 వేల 29 మరణాలు ఉండగా.. జూన్‌ 4వ తేదీనాటికి ఆ సంఖ్య 6 వేల 75కి చేరింది. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నదేశాల లిస్ట్‌లో భారత్‌ 12స్థానానికి చేరింది.

 

కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు ఇక్కడ కొత్తగా 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయ్‌. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 2 వేల 560 కేసులు, 122 మరణాలు రికార్డయ్యాయ్‌. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 74 వేల 860కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2 వేల 587 మంది మృత్యువాతపడ్డారు. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 58 శాతం ముంబైలో రికార్డయ్యాయ్‌. నగరంలో ఇప్పటివరకు 43వేల కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

 

మహారాష్ట్ర తర్వాత కొవిడ్‌ మహమ్మారి ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులో 25 వేల 872 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 15 వందల 13 మందికి కరోనా సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 23 వేల 645కి చేరింది. నాలుగోస్థానంలో గుజరాత్‌ ఉంది. గుజరాత్‌లో మొత్తం బాధితుల సంఖ్య 18 వేల 100కి చేరింది. కేరళలో వైరస్ తీవ్రత మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 82 మందికి వైరస్ సోకింది. దీంతో కేరళలో మొత్తం బాధితుల సంఖ్య 14 వందల 94కి చేరింది. మొత్తానికి వైద్య నిపుణులు హెచ్చరించినట్టే దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపులు, ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: