ఏపీ మంత్రి మండలి ప్రమాణం చేసి అచ్చంగా ఏడాది అయింది. జగన్ మాట ఇచ్చిన ప్రకారం మంత్రులకు రెండున్నరేళ్ల కాల పరిమితి ఉంది. అదే జగన్ చెప్పిన మెరకు, హెచ్చరించిన మేరకు ఎవరి పనితీరు అయినా బాగులేకపోతే వారిని మధ్యలోనే తప్పిస్తారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ కాకుండా పాతిక మంది మంత్రులు ఉన్నారు.

 

వీరిలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరితోపాటు అనేక మంది యువ మంత్రులు ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ అన్ని సామాజిక సమీకరణలు సరి చూసుకుని మంత్రులను నియమించారు. కానీ వీరిలో కొందరు తప్ప చాలా మంది అలంకారప్రాయంగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

దీంతో రెండవ ఏడాదిలోకి ప్రవేశించిన  జగన్ సర్కార్లో బరువైన మంత్రులను కొందరిని తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. జగన్ మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభ సభ్యులు అవుతున్నారు. ఈ ఇద్దరూ ఈ నెల 19న జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారి గెలుపు లాంచనం.

 

ఇక ఈ ఇద్దరి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే జగన్ ఈ ఇద్దరి ప్లేస్ లో కొత్తవారిని తీసుకుంటారా లేక మరింతమంది మంత్రులను తప్పించి కొత్త వారికి చోటు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో జగన్ తన అభిరుచికి అనుగుణంగా పనిచేయని మంత్రులను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది.

 

అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పటికిపుడు ఉండదని, అక్టోబర్ లో ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల ఫలితాలను కూడా బేరీజు వేసుకుని మంత్రులను తప్పిస్తే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండవని వైసీపీ హై కమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఆశావహులకు జగన్ ఈ దఫా చాన్స్ ఇస్తారా అన్నది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: