క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వైసీపీలో ఇప్పుడు ఒక్కో నేతా అసమ్మతి గళం వినిపిస్తుండడం, అధినేతను ధిక్కరిస్తూ మాట్లాడుతూ బహిరంగంగా మీడియాకు ఎక్కడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు జగన్ ఏపీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజల్లో దూసుకువెళ్తున్నాడు. అప్పట్లో వైఎస్ పాలనను పేదలు, రైతులు స్వర్ణయుగంగా ఎలా అయితే చెప్పుకున్నారో, ఇప్పుడూ అదే విధంగా జగన్ పాలనను చెప్పుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి మన్ననలు పొందుతూ వస్తున్నారు. కానీ సొంత పార్టీని పట్టించుకునే తీరిక లేకపోవడం, ఎంపీ, ఎమ్యెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్ దూరం పెట్టడం వంటి సంఘటనలు వైసీపీలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

 

IHG


పైకి చెప్పకపోయినా వైసీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడం, కనీసం పార్టీ శ్రేణులకు కూడా సమాచారం లేకపోవడం వంటి పరిణామాలు జగన్ పై   అసంతృప్తిని రాజేస్తున్నాయి. మొత్తం అధికారులను నమ్ముకునే జగన్ పరిపాలన చేస్తూ, తమను పక్కన పెడుతున్నారని చాలాకాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్రుగా ఉన్నారు. ఇక మంత్రుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకే తాము మంత్రులమీ అయినా అన్ని శాఖల మీద జగన్ పెత్తనమే కొనసాగుతోందని, శాఖల వారీగా అధికారులతో నివేదికలు తెప్పించుకుని మొత్తం అన్ని వ్యవహారాలను జగనే చక్కబెడుతుండడం, తాము నిమిత్తమాత్రులు గా మిగిలిపోతుండడం వంటివి మంత్రులను అసంతృప్తికి గురయ్యేలా చేస్తోంది.

 


 తాజాగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక అక్రమార్కులపై ఘాటుగా విమర్శలు చేశారు. రీచ్ లో లోడింగ్ అయిన గమ్యస్థానానికి రాకుండానే మాయం అవుతోందని అధికారిక సమావేశంలో చెప్పడం సంచలనం రేపింది. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా జగన్ పాలన పై తనదైన శైలిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు అంటూ రాం నారాయణ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడం వంటివి చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎంత సమర్థవంతమైన పరిపాలన ను ప్రజలకు అందిస్తున్నా, అంతే స్థాయిలో పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు , ఎంపీలను కూడా పట్టించుకుని ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, పార్టీ ప్రభుత్వం రెండూ జోడెద్దుల్లా ఉంటేనే బండి సక్రమంగా వెళుతుందని, పలువురు పార్టీ నాయకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: