కరోనా మహమ్మారి ఊహ‌కంద‌ని రీతిలో వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించింది.  అయితే.. ఇంత‌టి సాంకేతిక‌యుగంలో దాని అంతుచిక్క‌డం లేదు. నిరంత‌రం త‌న రూపాల‌ను మార్చుకుంటూ ప‌రిశోధ‌కుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ప‌రిశోధ‌న‌ల్లో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. కంటికి కనిపించని క‌రోనా వైరస్ భార‌త‌దేశంలో మొత్తం 198 విభిన్న రూపాల్లో సంచరిస్తున్నట్లు తేలింది. జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు దాదాపు 400 జన్యువులను పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కరోనా అత్యధిక జన్యుమార్పులకు గురైన రాష్ట్రాల‌ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఒక్క తెలంగాణలోనే 55 రకాలుగా పరివర్తనం చెందింది. తొలి స్థానంలో గుజరాత్‌ ఉంది. ఆ రాష్ట్రంలో 60 రకాల కరోనా వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించగా గాంధీనగర్‌లోనే 13 రకాల వైరస్‌లు బయటపడ్డాయి.

 

ఇక ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోనూ వైరస్‌ రూపాలను మార్చుకున్నది. మార్చి తొలి వారం, మే చివరి వారంలో వివిధ జన్యువులను పరీక్షించగా ఢిల్లీలో 39, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల విభిన్న క‌రోనా వైర‌స్‌ రూపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా, యూరప్‌, గల్ఫ్‌ దేశాల నుంచి కరోనా భారత్‌లోకి వచ్చిందని.. అందులో చైనా, యూరప్‌ నుంచి వచ్చిన వైరస్‌లే పెద్ద ప్ర‌మాద‌మ‌ని‌ జెడ్‌ఎస్‌ఐ కోల్‌కతా విభాగం డైరెక్టర్‌ కైలాశ్‌ చంద్ర వెల్లడించారు. యూరప్‌లో తొలిసారి ఇటలీలో కరోనాను గుర్తించారని, అదే యూరప్‌లో అంత దారుణంగా విజృంభించడానికి కారణమైందని వివరించారు. ఇక, ఇరాన్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రవర్తనను తెలిపేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ముందుముందు తీవ్ర ప‌రిణామాలు ఉండే ప్ర‌మాదం ఉంద‌ని ప‌రిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. భార‌త్‌లో కొద్దిరోజులుగా ఏకంగా రోజుకు ఎనిమిది తొమ్మిది వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: