ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా అప్పగింత కథ మళ్లీ మొదటికి వచ్చింది. అతన్ని అప్పుడే అప్పగించడం కుదరదని తేల్చేసింది బ్రిటన్. చట్టపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ...ఆగాల్సిందేనని ప్రకటించింది.  

 

లిక్కర్ డాన్‌ విజయ్ మాల్యా భారత్‌కు అప్పగింతపై సస్పెన్స్‌ నెలకొంది. మాల్యాపై కోర్టు విచారణలన్నీ ముగిసి త్వరలోనే దేశానికి అప్పగిస్తారని భావించినా... అది ఇప్పట్లో జరిగేలా కన్పించడం లేదు. ఇప్పుడప్పుడే అతడ్ని భారత్‌కు పంపలేమని, చట్టపరమైన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాకే పంపిస్తామని తేల్చిచెప్పింది బ్రిటన్‌.  

 

అయితే ఆ చట్టపరమైన సమస్యలేంటన్నది మాత్రం స్పష్టంచేయలేదు. దీంతో మాల్యాను భారత్‌కు తరలించేందుకు మరిన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

ఇప్పటికే మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తైంది. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ... మాల్యా వేసిన పిటిషన్‌ను యూకే సుప్రీం కోర్టులో కొట్టేసింది.  దీంతో ఏ క్షణమైనా అతన్ని దేశానికి తీసుకురావొచ్చని భావించారు. కేంద్రం కూడా చకచకా పావులు కదిపింది. భారత్‌కు తీసుకొచ్చి ముంబై ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే... యూకే చట్టాల రూపంలో మరికొన్ని రోజులు అతడికి రిలీఫ్ దక్కింది.

 

బ్యాంకుల వద్ద వేల కోట్ల రుపాయలు రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా... తిరిగి చెల్లించకుండా బ్రిటన్ పారిపోయాడు. దీంతో ఈడీ, సీబీఐ కేసు నమోదు చేసింది. అతడిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా గుర్తించింది భారత్‌. అప్పటి నుంచి దేశానికి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. లండన్ కోర్టులో మాల్యాను అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ భారత్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో... మాల్యా యూకే సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా మాల్యాకే ఎదురు దెబ్బ తగిలింది. మొత్తానికి లిక్కర్ డాన్  విజయ్ మాల్యాను భారత్ కు అప్పగింతపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. బ్రిటన్ ఇప్పట్లో అప్పగింతలు ఉండవని తేల్చిచెప్పేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: