తెలంగాణలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జన సమూహాలు ఉండే అన్ని ప్రదేశాలను పూర్తిగా మూసి వేశారు. ఇందులో దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే భక్తుల కోరిక మేరకు ఈ నెల 8 నుంచి దేవాలయాలు తెరిచేందుకు సన్నద్దమవుతున్నారు. కాకపోతే కొన్ని ఆంక్షలు అమలు చేశారు.  కేంద్ర‌, రాష్ట్ర  ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి  తెలంగాణ‌లోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాలు తెరిచే విషయమై అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు.

 

భక్తులు గతంలో వచ్చినట్లుగా గుంపులు గుంపులు గా రావడానికి వీలు తేదని తేల్చి చెప్పారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్‌ఓ‌పి)ను అధికారులతో చర్చించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్ల ఏర్పాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయం శుభ్రపరచడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెర‌వ‌నున్నామని, అయితే కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఆల‌యాల్లోకి భ‌క్తుల‌కు ప్రవేశం లేద‌ని స్పష్టం చేశారు.  శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

 

అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. అంత‌రాల‌య దర్శనం, శ‌ఠ‌గోపం, తీర్థ ప్రసాదాల విత‌ర‌ణ, వ‌స‌తి సౌక‌ర్యాలు ఉండ‌వ‌‌న్నారు. ఆల‌యాల వ‌ద్ద ఉన్న విక్రయ కేంద్రాల ద్వారా ప్రసాదాలు పొంద‌వచ్చని మంత్రి తెలిపారు.అలాగే కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏండ్ల పైబ‌డిన వారు, 10 ఏండ్ల లోపు పిల్లలు, క‌రోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు కూడా రావొద్దని సూచించారు. స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: