భారత్ లో కరోనా కేసులు రెండు లక్షలకు పైగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువయ్యాయి. దీనితో ఆందోళన ఎక్కువ అవుతుంది. అయితే కోవిడ్-19 విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరి అభిప్రాయం. మనదేశంలో గణాంకాలు చూస్తే కరోనా సోకిన ప్రతి 100 మందిలో చనిపోతున్నవారి సంఖ్య 3 కూడా లేదు. 97 మంది డిశ్చార్జి అవుతున్నారు. అందులో అత్యధికులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే రావడం లేదు.

 

చనిపోతున్నవారి వివరాలను అధ్యయనం చేస్తే వారిలో అత్యధికులు వయోధికులు. మిగతావారు ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారే. బీపీ, షుగర్‌తో బాధపడుతూ 90 ఏళ్లు దాటిన వృద్ధ దంపతులు కూడా కోలుకున్న ఘటనలు మన దేశంలో ఉన్నాయి. మనం కరోనా అంటే భయం పక్కనపెట్టి, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

 

జీవితకాలం మనం 'లాక్‌డౌన్'లో ఉండలేము. అలా చెయ్యడం వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని, ఆకలి చావులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి మరింత ప్రమాదకరం.  ఆరోగ్య జాగ్రత్తలు కరోనా విషయంలోనే కాదు, సాధారణ జీవితంలోనూ అవసరమే. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచాలి. అది బలంగా ఉన్నచోట కరోనాయే కాదు, దాన్ని మించిన ప్రమాదకారి వచ్చినా బలాదూరే. మానవాళి చరిత్రే ఇందుకు నిదర్శనం.

 

అయితే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మాస్కులు వేసుకోవడం, సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించడం, చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్లు వాడటం విధిగా పాటించాలి.  అదే సమయంలో మన ఇళ్లలోని చిన్న పిల్లలను, వయసు మళ్ళిన వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరోవైపు కరోనా వాక్సిన్ రావడానికి కనీసం వచ్చే ఏడాది మార్చి అవుతుందని చాలా మంది నిపుణుల అభిప్రాయం. దానితో అప్పటివరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: