దేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. మొదట్లో పదుల్లో వచ్చిన కేసులు మొన్నటి వరకూ వందల్లో వచ్చాయి. ఇప్పుడు ఏకంగా వేలల్లో రోజూ వస్తున్నాయి. ఇంకా ముందు ముందు అసలు కరోనా రాని వ్యక్తి ఉండడేమో అనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యనిపుణులు.

 

 

ఒక వేళ మీకు కరోనా లక్షణాలు ఉన్నా.. కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదంటున్నారు. కాకపోతే.. చాలా మందిలో కరోనా పాజిటివ్ వచ్చినా పెద్దగా లక్షణాలు కనిపించడం లేదు. అయితే కరోనా సీరియస్ ఎప్పుడో చెప్పేందుకు కొన్ని లక్షణాలను కేంద్రం సూచించింది. ఇంట్లోనే కరోనాకు చికిత్స అందుకోవచ్చని.. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం అర్జంట్ గా ఆసుపత్రిలో చేరాలని చెబుతోంది.

 

 

ఆ లక్షణాలు ఏంటంటే.. ముఖం, పెదవులు నీలం రంగులోకి మారడం, విపరీతంగా జ్వరం రావడం, గుండెలో నొప్పి రావడం, ఊపిరి ఆడకపోవడం.. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించవచ్చని కేంద్రం మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. మిగతా కరోనా లక్షణాలున్నా పెద్దగా ప్రమాదం లేదని కేంద్రం పేర్కొంది. కరోనా బాధితులు ఇంటిలోనే ఉన్నప్పుడు వారి గదిలోకి వెళ్లిన సమయంలో ఇతరులు మూడు పొరలు ఉన్న మాస్క్ ను ధరించాలని, మాస్క్ ను ధరించిన తరువాత ముట్టుకోరాదని, వినియోగం తరువాత కాల్చి వేయాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.

 

 

కరోనా రోగి ఉన్న గది లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వెల్లడించింది. రోగి కోసం వండిన ఆహారాన్ని అతనున్న గదికే చేర్చాలని, శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ దాటి, నాడి వేగం పెరిగితే వైద్యులకు సమాచారం ఇవ్వాలని, రోగి వాడే అన్ని రకాల వస్తువులనూ 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆపై శుభ్రం చేసి, తిరిగి వాడుకోవచ్చని తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తి ఇంటి పక్కనే ఉన్నా, ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమను తాము రక్షించుకునేందుకు పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: