ఇండియాలో కరోనా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జోరు ప్రదర్శిస్తోంది. ఇన్నాళ్లూ కరోనా విషయంలో మనం ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల గురించే అయ్యో పాపం.. అని చెప్పుకున్నాం.. కానీ ఇండియా పరిస్థితి కూడా కొన్ని రోజుల్లో అలాగే తయారయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కేసుల విషయంలో ఇండియా ఆరో స్థానానికి ఎగబాకింది.

 

 

కాకపోతే మరణాల సంఖ్యలో కాస్త తక్కువగా ఉండటమే ఇప్పటి వరకూ మనకు లభిస్తున్న ఊరట. కరోనా వచ్చిన మొదట్లో స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో రోజూ 800 మంది, 900 మంది చనిపోయేవారు. ఇప్పుడు ఇండియాలోనూ రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నారు. తాజాగా నిన్న పది వేల వరకూ దేశవ్యాప్తంగా కేసులు నమోదవగా... 270 మంది వరకూ మరణించారు. ఈ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

 

 

అందులోనూ స్పెయిన్, ఇటలీ వంటివి చాలా చిన్న దేశాలు. కానీ మన ఇండియా అలాకాదు 130 కోట్లు జనాభా ఉన్న దేశం. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉన్నాయి. మన దేశంలోనూ 2.26 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరగా ఉందన్నమాట. రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ ఇండియా నాలుగో స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వచ్చేసింది.

 

 

ఇక ఇప్పుడు కేసుల విషయంలో అమెరికా, బ్రెజిల్‌ మాత్రమే మనకంటే ముందున్నాయి. మరో విషయం ఏంటంటే ఇప్పుడే ఇండియాలో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే లక్షన్నర టెస్టుల వరకూ జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత అధికంగా 5,355 మంది కోలుకోవడం ఒక్కటే కాస్త శుభవార్తగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: