కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా మరోసారి రైతుల ఖాతాలలో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ నెలలో రైతుల ఖాతాలలో నగదు జమ చేసిన కేంద్రం ఆగష్టు నెల ఒకటో తేదీ నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మన్ నిధి పేరుతో ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. 
 
మూడు విడతల్లో 2,000 రూపాయల చొప్పున కేంద్రం రైతుల ఖాతాలలో ఈ నగదును జమ చేస్తొంది. ఈ నగదుకు అదనంగా ఏపీ ప్రభుత్వం 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ సీఈవో వివేక్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఆగష్టు నెలలో రైతులకు పీఎం కిసాన్ మరో విడత నగదు జమవుతుందని చెప్పారు. ఇప్పటివరకు 9.54 కోట్ల మంది రైతుల వివరాలను వెరిఫై చేశామని అన్నారు. 
 
వెరిఫై చేసిన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమవుతుందని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న రైతులలో కోటీ 30 లక్షల మందికి మాత్రం వివిధ కారణాల వల్ల డబ్బు అందలేదు. ల్యాండ్ రికార్డ్ కరెక్ట్ లేకపోవడం లేదంటే రైతులు ఆధార్ కార్డు అందజేయకపోవడం వల్ల వీరి ఖాతాలలో నగదు జమ కావడంలేదని తెలుస్తోంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఫార్మర్స్ కార్నర్ అనే ట్యాబ్ క్లిక్ చేసి ఈ పథకానికి అర్హులో కాదో సులభంగా తెలుసుకోవచ్చు. 
 
వెబ్ సైట్ లోనే పీఎం కిసాన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మోదీ జమ చేస్తున్న ఈ నగదు రైతులకు పంట పెట్టుబడుల కొరకు ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 18001155266, పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261కు ఫోన్ చేసి ఈ స్కీమ్ పై ఏవైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా పరిష్కారం తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మోదీ రైతుల ఖాతాలలో 6,000 రూపాయలు జమ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: