తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజూ వందకు పైగా కేసుల నమోదు అవుతూ ఉండటంతో అలజడి రేగుతోంది. ఏక్షణాన ఎవరికి సోకుతుందో... పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు. లాక్‌డౌన్ సడలింపులే దీనికి కారణమా? లేక మరేదైనా ఉందా అన్నది అంతుచిక్కడం లేదు. 

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పడగ విప్పి బుసలు కొడుతోంది. నీడలా వెంటాడుతున్న కరోనా... తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కలు చూస్తే... తెలంగాణలో కొత్తగా 143 కేసులు బయటపడ్డాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 116 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య  3వేల 290కి చేరింది.  24 గంటల్లో వైరస్‌కు మరో 8 మంది బలైపోగా మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది.  ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్ 5.. వరంగల్ 3..,ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి.. కరీంనగర్‌లో రెండేసి కేసులు.., మంచిర్యాలలో ఒక కరోనా కేసు తాజాగా నమోదైంది. 

 

మరోవైపు లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసులు పెరిగాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇతర ప్రాంతాలవారు, వలస కూలీల ద్వారా ఇలా జరిగిందన్నారు మంత్రి ఈటల.  టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నట్టు వివరించారు. ఇటు ఏపీలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లోకల్ కాంటాక్ట్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలసకూలీల ద్వారా రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 138 మందికి కరోనా సోకింది.. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వైరస్‌కు బలయ్యారు. 

 

కొత్త వాటితో కలిసి  మొత్తం 4 వేల 250కి చేరాయి మొత్తం కేసులు. ఇప్పటివరకు 73 మంది చనిపోయారు. మరోవైపు కంటైన్మెంట్ జోన్ల బయట కూడా కేసులు భయపెడుతున్నాయి. కోనసీమను కరోనా టెన్షన్‌ పెట్టిస్తోంది. జిల్లాకు వచ్చిన వలస కూలీల ద్వారా కరోనా వ్యాపిస్తోంది. అటు సచివాలయంలోనూ కలకలం సృష్టిస్తోంది. ముగ్గురుకి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాలు కాస్త సేఫ్‌గా అనిపించినా, లాక్‌ డౌన్‌ తర్వాత సీన్‌ మారుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ వేగంగా కేసులు పెరుగుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో కూడా నమోదవ్వడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: